న్యూఢిల్లీ, జూలై 25 : బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం నుంచి ఈక్విటీలకు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పడిపోయాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో శుక్రవారం తులం ధర రూ.500 తగ్గి రూ.99,120కి చేరుకున్నట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
దీంతోపాటు 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరకూడా అంతే స్థాయిలో తగ్గి రూ.98,750కి పరిమితమైంది. ప్రతీకార సుంకాల విధింపు మరింత సరళతరం కావడం, అమెరికా కరెన్సీ డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో బంగారానికి గిరాకీ తగ్గిందని, దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.