నిన్నమొన్నటిదాకా పరుగులు పెట్టిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులు.. పుత్తడి డిమాండ్‌ను అమాంతం తగ్గించేస్తున్నాయి మరి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భారత్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర మళ్లీ లక్ష రూపాయల స్థాయికి దిగొస్తుందన్నది నిపుణుల అంచనా.
న్యూఢిల్లీ, నవంబర్ 4: రికార్డుల మోత మోగించిన గోల్డ్ మార్కెట్‌ను నిశబ్దం ఆవరించింది. దాదాపు నెల కిందట ఆల్‌టైమ్ హై స్థాయిని తాకిన బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. ముఖ్యంగా దేశ, విదేశీ మార్కెట్లలో పడిపోతున్న పుత్తడి డిమాండ్‌ను.. చైనా నిర్ణయం మరింత దిగజార్చుతున్నది. ఇన్నాళ్లూ గోల్డ్ సేల్స్‌పై అక్కడి రిటైలర్లకు ఇచ్చిన విలువ ఆధారిత పన్ను (వ్యాట్) మినహాయింపును ఎత్తేశారు. ఈ నెల (నవంబర్) 1 నుంచి షాంఘై గోల్డ్ ఎక్సేంజ్ నుంచి కొనే పసిడికి వ్యాట్ వర్తిస్తుందని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బంగారం ఏ రూపంలో ఉన్నా పన్ను చెల్లించాల్సిందేనని చెప్పింది. నగలు, నాణేలు, కడ్డీలు, పారిశ్రామిక అవసరాలన్నింటికీ విక్రయించే గోల్డ్ ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
బంగారం కొనుగోళ్లలో ప్రపంచంలోనే చైనా మొదటి స్థానంలో ఉన్నది. అక్కడి మార్కెట్లో గోల్డ్‌కు డిమాండ్ విపరీతంగా ఉంటుంది మరి. ఇందుకు ఆ దేశ ప్రభుత్వం పసిడి అమ్మకాలపై ఇచ్చిన పన్ను మినహాయింపు కూడా కారణమే. అయితే ఇప్పుడా ప్రోత్సాహకానికి బ్రేక్ పడింది. దీంతో మార్కెట్లో పెరిగిన ధరలు.. సహజంగానే విక్రయాలపై ప్రభావం చూపనున్నాయి. ఇప్పటికే అది కనిపిస్తున్నది కూడా. ఈ క్రమంలో చైనాకు పసిడి దిగుమతులు తగ్గిపోవచ్చని అంటున్నారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గి ధరలు ఇంకా పతనమయ్యే అవకాశాలే ఎక్కువ. దీంతో చైనా తర్వాత అత్యధికంగా పసిడిని కొంటున్న భారత్‌కు ఇది కలిసిరానున్నదని ఎక్స్పర్ట్స్ మాట. ఇకపై భారత్‌కు వచ్చే బంగారం దిగుమతులు మరింత చౌక అవుతాయని, ఫలితంగా మార్కెట్లో ధరలూ దిగొస్తాయని వారు ప్రస్తుత ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. అంతేగాక డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ బలపడితే.. దిగుమతులకు చెల్లింపులు మరింత సులభతరం అవుతుందని అంటున్నారు.
అక్టోబర్ 17న భారతీయ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర ఏకంగా రూ.1,34, 800 పలికింది. ఇప్పుడది రూ.1,24,100 వద్దకు దిగింది. ఇంచుమించుగా గడిచిన 20 రోజుల్లో రూ.10,700 తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మారిన చైనా ట్యాక్స్ రూల్స్.. ఇంకా భారతీయ మార్కెట్లో రేట్లను దించుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఇది రిటైల్ సేల్స్‌ను ప్రభావితం చేస్తున్నదని నగల వ్యాపారులూ చెప్తున్నారు. ఈ రివర్స్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా మళ్లీ మేలిమి బంగారం ధర తులం లక్ష రూపాయలకు రావచ్చని అంటున్నారంతా.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రోజుకింత పడిపోతూనే ఉన్నాయి. మంగళవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) తులం ధర రూ.1,200 తగ్గింది. దీంతో ఢిల్లీ స్పాట్ మార్కెట్లో రూ.1,24,100గా నమోదైంది. కిలో వెండి ధర కూడా రూ.2,500 క్షీణించి రూ.1,51,500 వద్ద స్థిరపడింది. గత నెల అక్టోబర్ 14న ఇది ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.1,85,000 పలికిన విషయం తెలిసిందే. దీంతో 20 రోజుల్లో రేటు రూ.33,500 దిగజారినైట్టెంది. ఇదిలావుంటే హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి రూ.1,22,460గా ఉన్నది.
22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) పుత్తడి విలువ రూ.650 దిగి రూ.1,12,250కి తగ్గింది. అంతర్జాతీయంగా.. ఔన్స్ గోల్డ్ విలువ 7.84 డాలర్లు పడిపోయి 3,993.65 డాలర్లకు చేరింది. వెండి రేటూ దాదాపు 1 శాతం తగ్గి 47.73 డాలర్లుగా ఉన్నది. డాలర్ ఇండెక్స్ 0.12 శాతం పుంజుకొని 99.99కి చేరడం, వచ్చే ద్రవ్య సమీక్షలో కీలక వడ్డీరేట్ల తగ్గింపు ఉండబోదని అమెరికా రిజర్వ్ బ్యాంక్ సంకేతాలు ఇవ్వడం.. గోల్డ్ మార్కెట్‌ను షేక్ చేశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.