Gold Rates | దేవీ నవరాత్రి ఉత్సవాలతోపాటు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) రూ.750 పెరిగి రూ.61,650 వద్ద ముగిసిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. సరిగ్గా నాలుగు నెలల క్రితం జూన్ రెండో తేదీన 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.61,110 పలికింది. గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.60,900 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిస్థితుల ఆధారంగా దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు, కిలో వెండి ధర రూ.500 పెరిగి రూ.74,700 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 1980 డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.20 డాలర్లు పెరిగింది. మధ్య ప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో కామెక్స్ లో స్పాట్ గోల్డ్ ధర దాదాపు నాలుగు నెలల గరిష్ట స్థాయిని తాకింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్, మహారాష్ట్ర రాజధాని ముంబైల్లో తులం (24 క్యారట్స్) బంగారం ధర రూ.770 పెరిగి రూ.61,530 వద్ద ముగిసింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.700 పుంజుకుని రూ.56,400 వద్ద స్థిర పడింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.77,500, ముంబైలో రూ.74,100 పలికింది.
ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం ధరలు ధగధగమని మెరుస్తు్న్నాయి. శుక్రవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం డిసెంబర్ కాంట్రాక్ట్ డెలివరీ ధర రూ.381 పెరిగి రూ.60,699 పలికింది. న్యూయార్క్ లో ఔన్స్ బంగారం ధర 0.66 శాతం పుంజుకుని 1993.50 డాలర్ల వద్ద స్థిర పడింది.
సరిగ్గా సెప్టెంబర్ 20న తులం బంగారం ధర రూ.50 పతనమైనా రూ.60,300 వద్ద కొనసాగింది. సెప్టెంబర్ 19న రూ.60,350 వద్ద ట్రేడయింది. కిలో వెండి ధర రూ.300 పతనమై రూ.74,500 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1929 డాలర్లు, ఔన్స్ వెండి 23.20 డాలర్ల వద్ద నిలిచింది. బంగారానికి డిమాండ్ తగ్గడంతో సెప్టెంబర్ 20న ఎంసీఎక్స్ లో తులం బంగారం ధర రూ.82 తగ్గి రూ.59,200 వద్ద ముగిసింది. న్యూయార్క్ లో ఔన్స్ బంగారం ధర 1949.40 డాలర్ల వద్ద తచ్చాడింది.