Gold Rate | న్యూఢిల్లీ, మార్చి 18: బంగారం ధరలు మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలకు డిమాండ్ నెలకొనడంతో దేశీయంగా ధరలు మరో మైలురాయి రూ.91 వేలను అధిగమించాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. క్రితం రోజు ముగిసినదాంతో పోలిస్తే రూ.500 పెరిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.91,250కి చేరుకున్నది.
అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.450 అధికమై రూ.90,800కి చేరకుఉన్నది. గోల్డ్ ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా రికార్డు స్థాయికి ఎగబాకాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు సౌమిల్ గాంధీ తెలిపారు. ఇటు హైదరాబాద్ మార్కెట్లో పదిగ్రాముల గోల్డ్ ధర రూ.440 అధికమై రూ.90 వేలకు చేరుకోగా, 22 క్యారెట్ ధర రూ.400 అధికమై రూ.82,500కి చేరుకున్నది.
ఒకవైపు బంగారం రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుంటే మరోవైపు వెండి సెంచరీ దాటి యథాతథంగా కొనసాగుతున్నది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి రూ.1,02,500గా నమోదైంది. ఇటు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ.1,100 ఎగబాకి రూ.1.13 లక్షలకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,028.49 డాలర్లు పలుకగా, వెండి 34 డాలర్ల వద్ద ఉన్నది.