న్యూఢిల్లీ, మే 7: బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో బంగారం ధరలు మళ్లీ లక్ష రూపాయల మార్క్‌ను అధిగమించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల పుత్తడి ధర రూ.1,000 ఎగబాకి రూ.1,00,750కి చేరుకున్నది. మంగళవారం ధర రూ.99,750 స్థాయిలో ఉన్నది.
గత నెలలో బంగారం ధర రికార్డు స్థాయి రూ.1,01,600 కి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ తర్వాతి క్రమంలో అమెరికా-చైనా దేశాల మధ్య ప్రతీకార సుంకాల విధింపు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ దిగొచ్చింది. పసిడితోపాటు వెండి మరింత ప్రియమైంది. కిలో వెండి రూ.440 అందుకొని రూ.98,940కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 62.12 డాలర్లు లేదా 1.8 శాతం తగ్గి 3,369.65 డాలర్లు నమోదవగా, వెండి 1.24 శాతం తగ్గి 32.81 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.