Gold – Silver Rates | కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయం తీసుకున్న తర్వాత బంగారం ధర ధగధగ మెరుస్తున్నది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లలో గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.400 పెరిగి రూ.78, 250 లకు చేరుకున్నది. బంగారం ధర రూ.78 వేల మార్కును దాటడం ఇదే తొలిసారి. బుధవారం పది గ్రాముల (24 క్యారట్స్) ధర రూ.77,850 వద్ద స్థిర పడిన సంగతి తెలిసిందే.
మరోవైపు కిలో వెండి ధర గురువారం రూ.1,000 పెరిగి రూ.94 వేలకు దూసుకెళ్లింది. బుధవారం రూ.3000 పెరిగి రూ.93 వేలకు చేరుకున్న సంగతి తెలిపిందే. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్లో గోల్డ్ కాంట్రాక్టు అక్టోబర్ డెలివరీ ధర రూ.162 వృద్ధితో రూ.77,500లకు చేరుకున్నది. కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.1034 వృద్ధి చెంది రూ.93,079 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ లో ఔన్స్ బంగారం ధర మరో గరిష్టానికి చేరువలో కొనసాగుతున్నది. ఔన్స్ వెండి ధర 2.63 శాతం పెరిగి 32.86 డాలర్లు పలికింది.