న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : బంగారం కొండ దిగొస్తున్నది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టిన అతి విలువైన లోహాల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో డిమాండ్ భారీగా పడిపోవడంతోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను పావు శాతం తగ్గించడంతోపాటు ఈ ఏడాది మరో రెండుసార్లు రేట్లను తగ్గించే అవకాశాలున్నట్టు ఇచ్చిన సంకేతాలు మదుపరులకు రుచించలేదు. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో బంగారం ధరలు తగ్గాయి.
ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర రూ.600 దిగి రూ.1,13,200కి తగ్గింది. అంతకుముందు ఇది రూ.1,13,800గా నమోదైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.500 తగ్గి రూ.1,12,800కి చేరుకున్నది. బంగారంతోపాటు వెండి రూ.300 తగ్గి రూ.1,31,500 గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 3,668.33 డాలర్లకు చేరుకోగా, వెండి 41.90 డాలర్ల వద్ద ఉన్నది.