న్యూఢిల్లీ, ఆగస్టు 11 : రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పడిపోవడంతో దేశీయంగా తులం ధర రూ.900 దిగొచ్చింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల ధర రూ.1,02,520కి దిగొచ్చింది. రాజకీయ అనిశ్చిత పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన తులం ధర రూ.900 తగ్గి రూ.1,02,100గా నమోదైంది.
గడిచిన ఐదు సెషన్లలో పుత్తడి ధర రూ.5,800 ఎగబాకిన విషయం తెలిసిందే. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ కలిగిన తులం బంగారం ధర రూ.760 తగ్గి రూ.1,02,280కి పరిమితమైంది. అంతకుముందు ఇది రూ.1,03,040గా ఉన్నది. అలాగే 22 క్యారెట్ ధర కూడా రూ.700 దిగొచ్చి రూ.1,02,280గా నమోదైంది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంపై ఒక కొలిక్కి వచ్చే అవకాశాలుండటంతో గ్లోబల్ మార్కెట్లో పుత్తడి ధరలు భారీగా తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. పసిడితోపాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి రూ.1,000 తగ్గి రూ.1,14,000గా నమోదయ్యాయి.