Gold | అమెరికా-చైనా దేశాల మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతున్నది. ఈ క్రమంలో బంగారం ధరలు పతనమయ్యాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో 3200 డాలర్లకు చేరింది. ఈ ప్రభావం భారతీయ మార్కెట్లపై సైతం కనిపిస్తున్నది. ముంబయిలో 24 క్యారెట్ల బంగారం శనివారం మధ్యాహ్నం వరకు పది గ్రాములకు రూ.96,600కి చేరగా.. 22 క్యారెట్స్ గోల్డ్ రూ.87,460 వద్ద కొనసాగింది. శుక్రవారంతో పోలిస్తే బంగారం ధర రూ.2వేల వరకు పెరిగిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం రికార్డు స్థాయి ధర రూ.లక్ష మార్క్‌ని చేరుకునేందుకు కేవలం రూ.4,500 దూరంలో ఉన్నది. ఈ క్రమంలో జవేరి బజార్లో రీసైకిల్ చేసిన బంగారం అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగాయి. బాంబే బులియన్ అసోసియేషన్ సభ్యుడు, ఆభరణాల వ్యాపారి సంజయ్ కొఠారి మాట్లాడుతూ బంగారం ధర రికార్డు స్థాయిలో ఉందన్నారు.
దాంతో ప్రస్తుతానికి ఆభరణాల కొనుగోళ్లు జరగడం లేదని చెప్పారు. పెళ్లిళ్ల సీజన్ కారణంగా 80శాతం మంది వినియోగదారులు రీసైకిల్ చేసిన బంగారాన్ని అంటే.. పాత ఆభరణాలను కొత్తగా తయారు చేయించుకుంటున్నారని చెప్పారు. పాత బంగారాన్ని అమ్మి దాని స్థానంలో కొత్త ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కస్టమర్లు బంగారు నాణేలు, గతంలో కొనుగోలు చేసిన బంగారాన్ని విక్రయిస్తూ ఆభరణాలుగా మార్చుకుంటున్నారన్నారు. ఇంత ఎక్కువ ధరలు ఉన్నా.. 5శాతం వరకు కొత్త కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. ఇందులో అధిక ఆదాయవర్గం మాత్రమే షాపింగ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వెండితో చేసిన చిన్న వస్తువులను కొనుగోలు చేస్తున్నారని.. ఇందులో బహుమతులుగా ఇచ్చే కాళ్ల పట్టీలు, తేలికపాటిక వస్తువులకు 10శాతం వరకు డిమాండ్ ఉంటుందని చెప్పారు.
బాంబే బులియన్ అసోసియేషన్ జాతీయ ప్రతినిధి కుమార్ జైన్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి, వినియోగదారులు బంగారం కొనడానికి ముందు కొంచెం ఓపికపట్టాలని.. పెట్టుబడి పెట్టాలనుకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టాలన్నారు. ఎందుకంటే బంగారం ఖరీదైందని.. ప్రస్తుతం దాన్ని భౌతికంగా కాకుండా ప్రణాళికాబద్ధంగా కొనుగోలు చేయాలని చెప్పారు. అమెరికా -చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తత, సుంకాల ఆందోళనల కారణంగా ఇటీవల కొద్దిరోజులు ధరలు పతనమయ్యాయి. కానీ, తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర రికార్డు స్థాయిలో 3200 డాలర్లకు చేరింది. రాబోయే రోజుల్లోనూ పసిడి, వెండి ధరలు సైతం పెరగడం ఖాయమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నారు. అనిశ్చితి వాతావరణంలో భౌతికంగా బంగారం కొనుగోలు చేయకుండా.. సురక్షితమైన పెట్టుబడుల్లో ఒకటైన గోల్డ్ ఈటీఎఫ్ ద్వారా పెట్టుబడులను ఎంచుకోవచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.