Gold Price | న్యూఢిల్లీ, ఆగస్టు 12 : బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల నుంచి ఈక్విటీలకు తరలించడంతో వీటి ధరలు కుప్పకూలుతున్నాయి. వరుసగా రెండోరోజు మంగళవారం పదిగ్రాముల బంగారం ధర రూ.1,000 తగ్గింది. ఢిల్లీ బులియన్ మార్కెట్ ముగిసేసమయానికి పుత్తడి ధర రూ.1,01,520కి పరిమితమైంది. అంతకుముందు ఇది రూ.1,02,520గా ఉన్నది. పసిడి దిగుమతులపై ఎలాంటి టారిఫ్‌లు విధించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో వీటి ధరలు భారీగా తగ్గాయని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. దీనికి వెండి ధరలు భారీగా పడిపోయాయి. రూ.2 వేలు తగ్గిన కిలో వెండి రూ.1.12 లక్షలకు పరిమితమైంది.
పెట్టుబడులను ఆకట్టుకోవడంలో గోల్డ్ ఈటీఎఫ్‌లు విఫలమవుతున్నాయి. వరుసగా మూడో నెల జూలైలోనూ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు రూ.1,256 కోట్లకు పరిమితమయ్యాయి. జూన్‌లో వచ్చిన రూ.2,081 కోట్లతో పోలిస్తే 40 శాతం తగ్గాయని ఆంఫీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అధిక ధరలతోపాటు ప్రతీకార సుంకాల విధిం పు కొనసాగుతుండటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొన్నదని, దీంతో వరుస నెలల్లో పెట్టుబడులు భారీగా తగ్గుతున్నాయని వెల్లడించింది.