న్యూఢిల్లీ, జనవరి 26: బంగారం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న పుత్తడి మరో ఉన్నత శిఖరాలను అధిరోహించింది. ఇప్పటికే లక్షన్నర దాటిన గోల్డ్ ధర తాజాగా రూ.1.60 లక్షలను అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడంతో దేశీయంగా అంతే వేగంతో పెరుగుతున్నాయి. తాజాగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,60,260కి చేరుకున్నది.
అలాగే 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,46,900గా నమోదైంది. పుత్తడితోపాటు వెండి పరుగులు పెడుతున్నది. కిలో వెండి రూ.3.65 లక్షలు పలికింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం చెందడం, ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ద్రవ్యోల్బణం పుంజుకోవడంతో వడ్డీరేట్లు తగ్గి అవకాశాలు సన్నగిల్లడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలకు మళ్లించడం ధరలు పుంజుకోవడానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర తొలిసారిగా 5,130 డాలర్లను అధిగమించగా, వెండి 112 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితులతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో వీటి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి.