బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్న పసిడి రేటు.. ఒక్కరోజే తులం దాదాపు రూ.3 వేలు ఎగబాకింది. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితులు పుత్తడి విలువను అమాంతం పెంచేస్తున్నాయి. ఇదే దూకుడు కొనసాగితే ఈ పండుగ సీజన్లో కొత్త రికార్డులకు కొదవే ఉండదనిపిస్తున్నది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: సామాన్యులను ఊరిస్తున్న బంగారం.. సంపన్నులనూ సవాల్ చేస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతున్న పసిడి ధరలు.. రాకెట్ వేగంతో పైపైకి పరుగులు పెడుతున్నాయి. సోమవారం ఒక్కరోజే తులం రేటు దాదాపు రూ.3,000 ఎగబాకింది. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.2,700 ఎగిసి, మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,23,300 పలికింది. దీంతో భారతీయ స్పాట్ మార్కెట్లో నయా ఆల్టైమ్ హై రికార్డు నమోదైనట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది.
హైదరాబాద్లో బంగారం ధరల విషయానికొస్తే.. 24 క్యారెట్ తులం రూ.1,20,330గా ఉన్నది. సోమవారం రూ.1,370 పెరిగింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.1,250 ఎగిసి రూ.1,10,700 వద్ద నిలిచింది. ఇక కిలో వెండి ధర ఢిల్లీలో రూ.1,57,400గా నమోదైంది. ఈ ఒక్కరోజే రూ.7,400 పుంజుకోవడం గమనార్హం. హైదరాబాద్లో మాత్రం రూ.1,53,100గా ఉన్నట్టు జ్యుయెల్లర్స్ తెలిపారు. పండుగ సీజన్ దృష్ట్యా సాధారణ కొనుగోలుదారుల నుంచి వెండికి డిమాండ్ ఉందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. అలాగే పరిశ్రమల నుంచి కూడా ఆదరణ కనిపిస్తున్నదని, దీంతో ధరలు దౌడు తీస్తున్నాయని పేర్కొంటున్నారు.
ఈ నెల 18న ధనత్రయోదశి వస్తున్నది. ఈ రోజున బంగారం, వెండి కొనుగోళ్లు శుభప్రదమని దేశంలోని మెజారిటీ ప్రజల విశ్వాసం. అయితే మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.. అప్పటికల్లా రేట్లు ఇంకా పెరిగిపోవచ్చన్న అంచనాలైతే ఉన్నాయి. ఇదే జరిగితే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు రూ.1,50,000 దాటిపోవచ్చన్న అభిప్రాయాలైతే బలంగా వినిపిస్తున్నాయి. కిలో వెండి రేటూ రూ.1,80,000 దాటుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే ఫ్యూచర్ మార్కెట్లో రేట్లు భగ్గుమంటున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై డిసెంబర్ డెలివరీకిగాను 10 గ్రాములు రికార్డు స్థాయిలో రూ.1,20,075 పలికింది. అలాగే కిలో వెండి రూ.1,47,977 పలికింది. దీంతో ఇప్పుడు ఈ స్థాయిలకు మించి ధరలున్నా.. మున్ముందు పెద్దగా కరెక్షన్కు అవకాశాల్లేవన్న సంకేతాలైతే వస్తున్నాయి.
పెరుగుతున్న ధరలతో వ్యాపారాలు ఏ మేరకు సాగుతాయోనన్న భయాందోళనలు నగల వర్తకుల్లో నెలకొన్నాయి. ధరలు స్థిరంగా ఉంటేనే అమ్మకాలు బాగుంటాయని, ఇలా రోజుకింత పెరిగితే కొనేవారు సైతం ముందుకు రాలేరని అంటున్నారు. అసలే పండుగ సీజన్ కావడంతో దుకాణదారులు ఆఫర్లు పెట్టిమరీ కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి దీపావళి ముందు వారం రోజులు, తర్వాత వారం రోజులు గోల్డ్ మార్కెట్ అంతా సందడిగా ఉంటుంది. కానీ ఈ రేట్లతో ఈసారి కళ తప్పుతుందో ఏమోనన్న భయాలను మాత్రం వ్యక్తపరుస్తున్నారు చాలామంది. అయినప్పటికీ కొనుగోళ్లు బాగానే ఉంటాయన్న ఆశాభావాన్ని కనబరుస్తున్నారు.