Gold Rates | భారత్‌లో బంగారం ధరలు గురువారం చరిత్రలో తొలిసారిగా ఆల్‌టైమ్ హైకి చేరుకున్నది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MEX)లో పది గ్రాముల బంగారం ధర రూ.76,899 వద్ద ట్రేడవుతున్నది. అయితే, బంగారం పెరుగుదలను కారణాలు అనేకం ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో ప్రధానంగా సెంట్రల్ బ్యాంకుల వైఖరి, బాండ్ ఈల్డ్‌లను తగ్గించడం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణాలని పేర్కొంటున్నారు. కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరుకునేందుకు సెంట్రల్ బ్యాంకుల దృక్పథం, బాండ్ ఈల్డ్‌ల తగ్గింపుతో బులియన్ మార్కెట్లో డిమాండ్ పెరిగి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర రూ.76,899 ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిని తాకిందన్నారు. ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది మరోసారి వడ్డీ రేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నారు. గత నెలలో వడ్డీ రేట్లలో కోత విధించిన విషయం తెలిసిందే.
నవంబర్లోనూ 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టే అవకాశం ఉందని అంచనా. ఇంకా అమెరికా అధ్యక్ష ఎన్నికలు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు పెరిగాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని కొటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కైనాట్ చైన్వాలా తెలిపారు. యూఎస్ ట్రెజరీ దిగుబడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య కామెక్స్‌లో బంగారం ధరలు పెరిగాయన్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. లెబనాన్‌లోని హిజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడుల తర్వాత కామెక్స్‌లో బంగారం 0.5శాతం పెరిగి ఔన్స్‌కు 2,691.30 వద్ద ముగిసిందని చెప్పారు. బంగారం అదే ట్రెండ్‌ను కొనసాగిస్తే ప్రారంభ సెషన్లో 2,700.60 డాలర్లకు చేరుకుందన్నారు. త్వరలో జరుగబోయే అమెరికా ఎన్నికలపై అనిశ్చితి, కీలక ఆర్థిక డేటా అంచనాల కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయన్నారు.