న్యూఢిల్లీ, జనవరి 31: బంగారం కొండ దిగుతున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన అతి విలువైన లోహాల ధరలు అంతే వేగంతో కిందకు పడిపోతున్నాయి. గడిచిన పదిహేను రోజులుగా గరిష్ఠ స్థాయిలో కదలాడిన ధరలు ప్రస్తుతం తిరోగమనబాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్‌గా ట్రంప్ నమ్మిన బంట్ కెవిన్‌ను నియమించనున్నట్టు ప్రకటించడంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడంతో దేశీయంగా ధరలు 20 శాతం వరకు దిగొచ్చాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా 19 శాతం దిగి రూ.3.12 లక్షలకు పడిపోయింది.వరుసగా రెండోరోజు శనివారం కిలో వెండి ఏకంగా రూ.72,500 లేదా 18.85 శాతం తగ్గి రూ.3.12 లక్షలకు పడిపోయింది. గురువారం రికార్డు స్థాయి రూ.4.04 లక్షలకు చేరుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ జనవరి నెలలో కిలో వెండి రూ.73 వేలు లేదా 30 శాతం ఎగబాకింది. డిసెంబర్ 31, 2025న కిలో ధర రూ.2.39 లక్షలుగా ఉన్నది. అలాగే బంగా రం రూ.3,500 లేదా 2 శాతం తగ్గి రూ. 1.65 లక్షలకు దిగొచ్చినట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర శుక్రవారం 7.6 శాతం తగ్గి రూ.1.69 లక్షలకు దిగొచ్చిన విషయం తెలిసిందే. గురువారం రికార్డు స్థాయి రూ.1.83 లక్షలు పలికింది. జనవరి నెలలో పదిగ్రాముల గోల్డ్ ధర రూ.27,800 లేదా 20.2 శాతం ఎగబాకింది.
గ్లోబల్ మార్కెట్లో భారీ పతనం
అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా మూడోరోజూ శుక్రవారం కూడా ధరలు భారీగా తగ్గాయి. ఔన్స్ గోల్డ్ ధర 530.53 డాలర్లు లేదా 9.83 శాతం తగ్గి 4,865 డాలర్ల వద్దకు పడిపోయింది. దీంతో వరుసగా మూడు రోజుల్లో గోల్డ్ ఏకంగా 20 శాతం వరకు తగ్గినట్టు అయింది. అలాగే వెండి కూడా 31 డాలర్లు లేదా 27 శాతం తగ్గి 84.70 డాలర్లకు పరిమితమైంది. శని, ఆదివారాలు అంతర్జాతీయ మార్కెట్లలో సెలవుకావడం తిరిగి సోమవారం బులియన్ ట్రేడింగ్ నిర్వహించనున్నారు. ఈవారం మొదట్లో ఔన్స్ వెండి రికార్డు స్థాయి 121.75 డాలర్లు పలికిన విషయం తెలిసిందే. దీంతో రికార్డు స్థాయి నుంచి 35 శాతం తగ్గినట్టు అయింది. గడిచిన పదేండ్లలో ఒకేరోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి కావడం విశేషం. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో కిలో వెండి ఏకంగా 25 శాతం లేదా లక్ష రూపాయల వరకు దిగొచ్చింది. పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడం ఇందుకు కారణం.
బడ్జెట్‌పై ప్రత్యేక దృష్టి
వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్లో తీసుకునే నిర్ణయంపై బంగారం ధరలు ఆధారపడివున్నాయి. ఆర్థిక సర్వేలో మాత్రం భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. కానీ, ప్రస్తుతం వీటిపై కస్టమ్స్ డ్యూటీలో ఎలాంటి మార్పులు చేసినా ధరలపై ప్రభావం చూపనున్నాయి.
ధరలు తగ్గడానికి కారణాలు
భవిష్యత్తులో కరెక్షన్ తప్పదు!
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు భవిష్యత్తులో కరెక్షన్కు గురికాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గోల్డ్ ధరలు 6 శాతం వరకు తగ్గగా.. వెండి 40 శాతం, ప్లాటినం ధరలు 10 శాతం వరకు దిగొచ్చాయని వారు అంటున్నారు. పెరుగుట విరుగుటకే అన్న సత్యం నిజంకాబోతున్నదని వారు పేర్కొంటున్నారు. ఈక్విటీలు, అతి విలువైన లోహాల ధరలు దీర్ఘకాలికంగా నిలకడగా పెరుగుతు ఉంటే స్థిరంగా ఉంటాయి..కానీ, ఒకేసారి తుఫాన్ మాదిరిగా పుంజుకుంటే మళ్లీ వెను దిరిగి రాక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. జనవరి నెలలో గోల్డ్ విలువ 17 శాతం వరకు అధికమవగా, వెండి 43 శాతం ఎగబాకింది.