సామాన్యులకు అందనంత ఎత్తుకు బంగారం ధరలు చేరుకున్నాయి. రోజురోజుకూ వేలల్లో పెరుగుతున్న రేట్లు.. గోల్డ్ జ్యుయెల్లరీని సగటు భారతీయులకైతే దూరం చేసేశాయి. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాములు మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,32,400 పలుకుతున్నది. ఈ క్రమంలో పసిడి నగలను కొనడం సాహసమనక తప్పని పరిస్థితి. అయితే వెండి ఆభరణాలు ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్‌గా ఉంటున్నాయి. కిలో ధర ఆల్‌టైమ్ హై రికార్డు దరిదాపుల్లోనే ఉన్నప్పటికీ చాలామంది సిల్వర్ జ్యుయెల్లరీని ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంచుమించుగా తులం పుత్తడి రేటుకే దాదాపు కేజీ వెండి వస్తున్నది మరి.
ఫలితంగా వెండి నగలకు ఆదరణ అంతకంతకూ పెరుగుతూపోతున్నదని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి విలువ రూ.1,70,000గా ఉన్నది. దీంతో లైట్ వెయిటేగాక హెవీ జ్యుయెల్లరీ కొనుగోలుకూ మెజారిటీ కస్టమర్లు ముందుకొస్తున్నారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి వెండిలో రకరకాల డిజైన్లను ఇప్పుడు నగల దుకాణదారులు అమ్మకానికి పెడుతున్నారు. పైగా నేటి తరానికి నచ్చేలా ఉంగరాలు, బ్రేస్లెట్లు, గాజులు, కమ్మలు, పట్టీలు, వడ్డాణాలు, నెక్లెస్‌లను బ్రాండెడ్ సంస్థలూ తయారు చేయిస్తున్నాయి.