Gold Rate | న్యూఢిల్లీ, డిసెంబర్ 16: పలు అంతర్జాతీయ అంశాల ప్రభావంతో ప్రస్తుతం బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి సమీపంలో ట్రేడవుతున్నది. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ పుత్తడి ధర 13 శాతం పెరిగింది. వాస్తవానికి నవంబర్ వరకూ స్టాక్ మార్కెట్‌ను మించి రాబడులు ఇచ్చిన బంగారం..డిసెంబర్లో హఠాత్తుగా జరుగుతున్న షేర్ల ర్యాలీతో పోలిస్తే వెనుకపడింది. స్టాక్ మార్కెట్ ప్రధాన సూచి నిఫ్టీ-50 నెలరోజులుగా 8.5 శాతం పెరగడంతో ఈ ఏడాది ఇప్పటివరకూ స్టాక్స్ రాబడి 18.5 శాతానికి చేరింది. అయితే గత నెలరోజుల్లో పుత్తడి 3 శాతమే పెరిగింది. కానీ ఈ ఏడాది మొత్తంమీద బంగారం చేకూర్చిన 13 శాతం విలువ బ్యాంక్ ఎఫ్డీలను, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ను, చిన్న మొత్తాల పొదుపుకంటే మించే ఉన్నది. పసిడి ఇంతగా పెరగడానికి పలు కారణాల్ని కమోడిటీ నిపుణులు చెపుతున్నారు.
అవి..
సురక్షిత సాధనం: ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం ఏర్పడటంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించే బంగారంవైపు ఇన్వెస్టర్లు పరుగులు తీశారు.
భౌగోళియరాజకీయ ఉద్రిక్తతలు: ఈ క్యాలండర్ సంవత్సరం ద్వితీయ, తృతీయ త్రైమాసికంలో పుత్తడి ధరలు వెనుకంజవేసినప్పటికీ, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంతో నాల్గవ త్రైమాసికంలో బంగారానికి తిరిగి డిమాండ్ పెరిగింది.
ఫెడ్ సరళవైఖరి, డాలర్ క్షీణత: వచ్చే 2024లో వడ్డీ రేట్ల కోతలు ఉంటాయంటూ తాజాగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడం, డాలర్ విలువ తగ్గడంతో ఇన్వెస్టర్లకు పుత్తడి ఆకర్షణీయంగా మారింది.
కేంద్ర బ్యాంక్‌ల కొనుగోళ్లు: పలు ప్రపంచదేశాల కేంద్ర బ్యాంక్‌లు బంగారం నిల్వలు పెంచుకునేందుకు భారీస్థాయిలో కొనడం కూడా ధర పెరుగుదలకు ఒక కారణం.
పండుగ డిమాండ్: ఈ ఏడాది చివరి త్రైమాసికంలో భారత్‌లో పండుగ సీజన్ సందర్భంగా పసిడికి పటిష్ఠమైన డిమాండ్ ఏర్పడింది.
మరింత పెరుగుతుందా?
వచ్చే 2024లో మూడు దఫాలు వడ్డీ రేట్లను తగ్గించే సంకేతాల్ని యూఎస్ ఫెడ్ వెల్లడించినందున పుత్తడి ధరలు అప్‌ట్రెండ్‌లోనే ఉంటాయని కమోడిటీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రిస్కీ ఆస్తులుగా పరిగణించే ఈక్విటీలవైపు తాజాగా ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నందున సమీప భవిష్యత్తులో పరిమితశ్రేణిలోనే బంగారం ధరలు కదలవచ్చని మార్కెట్ నిపుణుడు సుగంధ్ సచ్‌దేవా తెలిపారు. ఈ వారం కదలికలపై అంచనాల్ని వెల్లడిస్తూ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 62,800 స్థాయిని దాటితే రూ.63,500 వరకూ పెరగవచ్చన్నారు. రూ.61,200 నుంచి రూ.60,700 వరకూ మద్దతు లభించవచ్చని అంచనా వేశారు.