హైదరాబాద్, జూన్ 8: బంగారం కొండ దిగుతున్నది. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి భారీగా దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా అతి విలువైన లోహాలు ధరలు ఒక్కసారిగా తగ్గడంతో దేశీయంగా ధరలు చౌకతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.2,080 తగ్గి రూ.71,670కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.73,750గా ఉన్నది. అలాగే 22 క్యారెట్ బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.67,600 నుంచి రూ.65,700గా నమోదైంది.
అగ్రరాజ్యం అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు తగ్గుముఖం పట్టడం, ద్రవ్యోల్బణ గణాంకాలు పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని బులియన్ వర్తకులు వెల్లడిస్తున్నారు. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.4,500 తగ్గింది. దీంతో కిలో వెండి రూ.1,00,500 నుంచి రూ.96 వేలకు దిగొచ్చింది. అలాగే న్యూఢిల్లీలో తులం బంగారం రూ.2,080 దిగి రూ.71,820కి తగ్గింది. పసిడితోపాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర శుక్రవారం ఒకేరోజు 79.70 డాలర్లు తగ్గి 2,311.20 డాలర్లకు పడిపోయింది. అలాగే వెండి 2 డాలర్లు తగ్గి 29.27 డాలర్లుగా నమోదైంది.