న్యూఢిల్లీ, డిసెంబర్ 23 : బంగారం ధర మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. వరుసగా రెండురోజులుగా పెరుగుతున్న ధర మంగళవారం మరో ఆల్‌టైం హైకి ఎగబాకింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.2,650 ఎగబాకి రూ.1,40,850 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా గోల్డ్ విలువ దూసుకుపోవడం వల్లనే దేశీయంగా పుంజుకుంటున్నదని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. సోమవారం ఈ ధర రూ.1,38,200గా నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధర రూ.61,900 లేదా 78.40 శాతం ఎగబాకినట్టు అయింది. క్రితం ఏడాది డిసెంబర్ 31న రూ.78,950గా ఉన్నది.
బంగారంతోపాటు వెండి వెలుగులు జిమ్ముతున్నది. కిలో వెండి మరో రూ.2,750 అందుకొని రికార్డు స్థాయి రూ.2,17,500కి చేరుకున్నది. గత రెండు రోజుల్లో వెండి రూ.12 వేలకు పైగా ఎగబాకింది. ఈ ఏడాది ఇప్పటి వరకు కిలో వెండి రూ.1,27,550 లేదా 142 శాతం ఎగబాకింది. కిందటేడాది కిలో ధర రూ.89,700గా ఉన్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,500 డాలర్ల పైకి చేరుకోవడంతోపాటు వచ్చే ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను ఒకటికి మించి తగ్గించే అవకాశాలుండటం, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతుండటం కూడా ధరలు పెరుగడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.