Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్స్ బంగారం తులం ధర స్వల్పంగా రూ.80 తగ్గి రూ.61,820 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. మంగళవారం 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.61,900 వద్ద ముగిసింది.మరోవైపు బుధవారం కిలో వెండి ధర రూ.700 తగ్గి రూ.75,050 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఔన్స్ బంగారం 1981 డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.70 డాలర్లు పలికింది. కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 8 డాలర్లు తగ్గి 1981 డాలర్ల వద్ద నిలిచింది. అమెరికాలో నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరగడంతో వచ్చే ఏడాది వడ్డీరేట్ల తగ్గింపుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరోవైపు బుధవారం రాత్రి వడ్డీరేట్లు, ద్రవ్యపరపతి సమీక్షపై యూఎస్ ఫెడ్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలపై ఇన్వెస్టర్లు కేంద్రీకరించారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు.
ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగి వచ్చాయి. బుధవారం మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో 24 క్యారట్ల బంగారం తులం (ఫిబ్రవరి డెలివరీ ధర) రూ.52 తగ్గి రూ.61,129 వద్ద ట్రేడయింది. న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 0.04 శాతం పెరిగి 1993.90 డాలర్ల వద్ద నిలిచింది.