Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ప్రపంచ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ మధ్య స్టాకిస్టులు అమ్మకాలు జరుపడంతో ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గి తులం ధర రూ.1,00,170కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అలాగే, 22 క్యారెట్ల పసిడి ధర రూ.150 తగ్గి రూ.99,900కి తగ్గింది. అదే సమయంలో వెండి ధరలు కిలోకు రూ.1,15,000 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.
ప్రపంచ మార్కెట్లలో న్యూయార్క్లో బంగారం 0.26 శాతం తగ్గి ఔన్సుకు 3,363.45కి డాలర్లకు చేరింది. వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు పెరగడంతో సానుకూల ధోరణిని కలిగి ఉంటుందని భావిస్తున్నారని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ అండ్ కరెన్సీ హెడ్ ప్రవీణ్ సింగ్ పేర్కొన్నారు. స్పాట్ సిల్వర్ కూడా 0.17 శాతం తగ్గి ఔన్సుకు 38.78 డాలర్లకు చేరింది. మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి మాట్లాడుతూ.. గత వారం జాక్సన్ హోల్ సింపోజియంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. డిసెంబర్ తర్వాత సెంట్రల్ బ్యాంక్ త్వరలో తొలిసారి వడ్డీ రేట్లను తగ్గించవచ్చని పావెల్ పేర్కొన్నారు. రాబోయే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ FOMC సమావేశం సెప్టెంబర్ 16-17 తేదీల్లో జరుగనున్నది. అయితే, నిరంతర ద్రవ్యోల్బణ ఆందోళనలు, మందగించిన ఆర్థిక కార్యకలాపాలు దూకుడు వడ్డీ రేటు కోతలకు దారితీయకపోవచ్చని కలాంత్రి పేర్కొన్నారు.
దాంతో బంగారం లాభాలను అడ్డుకునే అవకాశం ఉందన్నారు. పెట్టుబడిదారులు రెండవ త్రైమాసికానికి సంబంధించిన ప్రైమరీ యూఎస్ జీడీపీ డేటాను పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తారని ఆగ్మాంట్ పరిశోధన విభాగాధిపతి రెనిషా పేర్కొన్నారు. ఈ డేటా గురువారం విడుదల కానున్నది. ఇది ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి, బులియన్ సెంటిమెంట్ గురించి అంచనాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల బంగారం రూ.1,01,510 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి రూ.93,050గా ఉన్నది. కిలో వెండి రూ.1.31లక్షల ధర పలుకుతున్నది.