Gold ETF | న్యూఢిల్లీ, అక్టోబర్ 24: బంగారం, వెండి ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) పెట్టుబడిదారులకు సిరులు కురిపిస్తున్నాయి. మదుపరులకు తమ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోల్లో వైవిధ్యానికి బాగా కలిసొస్తున్న ఈ గోల్డ్-సిల్వర్ ఈటీఎఫ్‌లు.. అందుకు తగ్గట్టుగానే ఆకర్షణీయ రాబడులను పంచి పెడుతున్నాయి మరి. దీంతో దేశీయంగా ఇప్పుడు ఎక్కువమంది ఇన్వెస్టర్లు వీటిల్లోనే పెద్ద ఎత్తున మదుపునకు దిగుతున్నారు. మార్కెట్లో ఒడిదొడుకులు, ఆర్థిక అస్థిరతల మధ్య ఇన్వెస్టర్లకు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా గోల్డ్-సిల్వర్ ఈటీఎఫ్‌లే కనిపిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల నుంచైతే సిల్వర్ ఈటీఎఫ్‌లకు భారీగా ఆదరణ లభిస్తున్నది.
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేది ఓ కమోడిటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్. ఇది బంగారంపై పెట్టుబడులు పెడుతుంది. వ్యక్తిగత స్టాక్స్ తరహాలోనే వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో ఇవి ట్రేడ్ అవుతాయి. డీమెటీరియలైజ్డ్ (డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్), పేపర్ రూపంలో ఇక్కడ భౌతిక బంగారం ఉంటుంది. బంగారానికి బదులుగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు అవి ట్రేడ్ అయినప్పుడు నగదు రూపంలో వారి ఖాతాల్లో యూనిట్ల (యూనిట్ అంటే ఒక గ్రాము)కు సమానంగా జమవుతుంటాయి. ఇక దేశీయ మార్కెట్లో భౌతిక బంగారం ధరలకు అనుసంధానమై వీటి విలువ ఉంటుంది. ధరలు పెరిగితే పెరగడం.. తగ్గితే తగ్గడం జరుగుతుంది. సిల్వర్ ఈటీఎఫ్‌లూ ఇంతే.
గోల్డ్-సిల్వర్ ఈటీఎఫ్‌లను మార్కెట్ ట్రేడింగ్ సమయాల్లో సులభంగా అమ్ముకోవచ్చు లేదా కొనవచ్చు. ధరలు పారదర్శకంగా ఉంటాయి. ఇక భౌతిక బంగారం మాదిరి వీటిని ఇండ్లలో, లాకర్లలో నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు. అపహరణ సమస్యలుండవు. రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే మార్కెట్ రిస్కులకు లోబడి ఈ పెట్టుబడులుంటాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవాలి.
గోల్డ్-సిల్వర్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులకు మదుపరులు ఇంతలా ఆసక్తి కనబర్చడం వెనుక పన్ను ప్రోత్సాహకాలూ ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఈ ఏడాది జూలైలో లోక్‌సభలో ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో పన్నులను సవరించడం ఈ ఈటీఎఫ్‌లను మరింత ఆకర్షణీయం చేసింది. జూలై 23 నుంచి కొత్త పన్నులు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం ఏడాదికిపైగా ఉంచుకున్న ఈటీఎఫ్‌లను అమ్మడం ద్వారా పొందే లాభాలపై 12.5 శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుంది. ఏడాదిలోపే అమ్మేస్తే సదరు మదుపరి ఆదాయ పన్ను (ఐటీ) స్లాబ్ రేటు ప్రకారం పన్నులుంటాయి.