Gold-Silver Rates | జీవిత కాల గరిష్టాన్ని తాకిన బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. శుక్రవారం దేశ రాజధానిలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1150 తగ్గుముఖం పట్టి రూ.80,050లకు చేరుకున్నది. ఇక 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.350 పతనమై రూ.80,450 వద్ద స్థిర పడింది. గురువారం 99.9 శాతం స్వచ్ఛత (24 క్యారట్స్) బంగారం తులం ధర రూ.81,200 పలికింది. కిలో వెండి ధర సైతం రూ.2000 తగ్గి రూ.99వేల మార్కుకు చేరింది. గురువారం కిలో వెండి ధర రూ.1.01 లక్షలు పలికిన సంగతి తెలిసిందే.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం డిసెంబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ ధర రూ.406 పతనమై రూ.77,921లకు చేరుకుంది. కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.1,134 క్షీణించి రూ.95,898లతో సరిపెట్టుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఔన్స్ బంగారం 15.90 డాలర్లు తగ్గి 2733 డాలర్లు పలికితే, ఔన్స్ వెండి ధర 1.39 శాతం నష్టంతో 33.33 డాలర్లకు చేరుకున్నది. యూఎస్ మాక్రో డేటాతో వచ్చే నెలలో అంచనాల కంటే తక్కువగా యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచనాల మధ్య బంగారం, వెండిలకు గిరాకీ తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.