Gold Demand | ఇటీవల బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతూ వచ్చాయి. రోజు రోజుకు పెరుగుతూ సరికొత్త గరిష్టాలకు చేరాయి. అయితే, పెరుగుతున్న ధరలను డిమాండ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్‌లో బంగారం డిమాండ్ పరిమాణం పరంగా 16శాతం తగ్గిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గురువారం వెల్లడించింది. రికార్డు స్థాయికి ధరలు పెరిగిన నేపథ్యంలో వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గిందని పేర్కొంది. అయితే, అధిక రాబడి నేపథ్యంలో పెట్టుబడుల కోణంలో కొనుగోళ్లు పెరిగినట్లు పేర్కొంది. మూడవ త్రైమాసికంలో మొత్తం బంగారం డిమాండ్ 248.3 టన్నుల నుంచి 209.4 టన్నులకు తగ్గింది. అయితే, అదే కాలంలో డిమాండ్ విలువ ఆధారంగా లెక్కించినట్లయితే, 23 శాతం పెరుగుదలను నమోదు చేసింది. బంగారం డిమాండ్ విలువ రూ.1,65,380 కోట్ల నుంచి రూ.2,03,240 కోట్లకు పెరిగింది.
ప్రపంచంలోని రెండవ అతిపెద్ద బులియన్ మార్కెట్లో వినియోగంలో ప్రధాన భాగమైన బంగారు ఆభరణాల డిమాండ్ 31 శాతం తగ్గి 171.6 టన్నుల నుంచి 117.7 టన్నులకు పడిపోయింది. అయితే, ఆభరణాల కొనుగోళ్ల విలువ దాదాపు రూ.1,14,270 కోట్ల వద్ద స్థిరంగా ఉన్నది. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, వినియోగదారులు ధరలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని డేటా సూచించింది. పెట్టుబడి డిమాండ్ గణనీయంగా బలపడిందని, వాల్యూమ్ పరంగా 20 శాతం పెరిగి 91.6 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. విలువ పరంగా ఇది 74 శాతం పెరిగి రూ.51,080 కోట్ల నుంచి రూ.88,970 కోట్లకు చేరుకుంది. దీర్ఘకాలిక విలువ నిల్వగా బంగారంపై భారతీయ వినియోగదారులలో పెరుగుతున్న వ్యూహాత్మక నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌కు చెందిన భారతీయ ప్రాంతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సచిన్ జైన్ తెలిపారు.
గత త్రైమాసికంలో భారతదేశంలో బంగారం సగటు ధర 10 గ్రాములకు రూ.97,074.9 ఉండగా.. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.66,614.1 కంటే 46 శాతం ఎక్కువగా ఉన్నది. అంతర్జాతీయ ధరలు సగటున ఔన్సుకు 3,456.5 డాలర్ల వద్ద ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఔన్సుకు 2,474.3 డాలర్ల ధర పలికింది. పరిమాణంలో తగ్గుదల ఉన్నప్పటికీ, అక్టోబర్‌లో ధంతేరస్, దీపావళి సమయంలో బలమైన అమ్మకాలను జరిగాయని.. కీలకమైన పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో సానుకూల కొనుగోళ్లు ఉంటాయని జైన్ అంచనా వేశారు. పరిమాణం పరంగా 16శాతం తగ్గిందని.. కానీ విలువలో చారిత్రాత్మక పెరుగుదల 23 శాతంగా ఉందని తెలిపారు. ఇటీవలి నెలల్లో ధరల పెరుగుదల కారణంగా, చాలా మంది వినియోగదారులు ఇప్పటికే తమ వివాహ కొనుగోళ్లు పూర్తి చేశారన్నారు. బంగారం దిగుమతులు 37 శాతం తగ్గి 308.2 టన్నుల నుంచి 194.6 టన్నులకు పడిపోయాయి. రీసైక్లింగ్ 7 శాతం తగ్గి 21.8 టన్నులకు పతనమైంది. జూలై 2024 బడ్జెట్లో చారిత్రాత్మక సుంకం కోత ప్రకటించిన తర్వాత గత సంవత్సరం దిగుమతి గణాంకాలు పెరిగాయని జైన్ చెప్పారు. పూర్తి సంవత్సరానికి డిమాండ్ 600-700 టన్నులుగా ఉంటుందని కౌన్సిల్ అంచనా వేస్తోంది.