Gold Rates | అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు నెలకొనడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.380 పెరిగి రూ.62,150 పలికిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇంతకుముందు సెషన్లో 24 క్యారట్స్ బంగారం తులం రూ.61,770 పలికింది. మరోవైపు కిలో వెండి కూడా రూ.100 పెరిగి రూ.76,400 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 1992 డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.66 డాలర్లు పలికాయి.
యూఎస్ ఫెడ్ రిజర్వు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి కీలక వడ్డీరేట్లు పెంచనున్నదన్న అంచనాల మధ్య ట్రెజరీ బాండ్ల ధరలు పడిపోగా, డాలర్ బలహీన పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ)పైనే బులియన్ వ్యాపారులు ఫోకస్ చేస్తారని సౌమిల్ గాంధీ వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఫ్యూచర్స్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.353 పెరిగి రూ.61,010 వద్ద స్థిర పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ధర రూ.353 పెరిగి రూ.61,010 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయంగా న్యూయార్క్లో ఔన్స్ బంగారం ధర 0.71 శాతం పెరిగి 1994.30 డాలర్లకు చేరుకున్నది.