Gold-Silver Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారెట్స్) ధర వరుసగా రెండో రోజు రూ.150 పెరుగుదలతో రూ.63,100కు చేరుకున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. మరోవైపు కిలో వెండి ధర రూ.700 పుంజుకుని రూ.78,100 వద్ద స్థిర పడింది. గురువారం తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.62,950 వద్ద ముగిస్తే.. కిలో వెండి ధర రూ.77,400 వద్ద నిలిచింది.
వచ్చే మార్చి నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వు సంకేతాలివ్వడంతో అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ పడిపోయింది. ఫెడ్ రిజర్వు నిర్ణయంతో బంగారంపై వరుసగా రెండో రోజు ధర పెరిగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి కాంట్రాక్ట్ ధర తులం (24 క్యారెట్స్) ధర రూ.27 పెరిగి రూ.62,481 వద్ద స్థిర పడింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం విలువ 2037 డాలర్లు, ఔన్స్ వెండి విలువ 24.19 డాలర్లు పలికింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం 0.34 శాతం పతనంతో 2051.80 డాలర్ల వద్ద కొనసాగింది.