Gold Prices | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరాయి. బుధవారం మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు దేశ రాజధాని నగరం ఢిల్లీలో రూ.77,850 పలికింది. మంగళవా రం ముగింపుతో చూస్తే ఒక్కరోజే రూ.900 ఎగిసింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం రేటూ రూ.900 ఎగబాకి రూ.77, 500గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరల్లో కొనసాగుతున్న ర్యాలీనే ఇందుకు కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన్ వెల్లడించింది. హైదరాబాద్‌లోనూ 24 క్యారెట్ పుత్తడి 10 గ్రాములు రూ. 660 పుంజుకొని రూ.77,020గా ఉన్నది.
బంగారానికితోడు వెండి ధరలూ పరుగులు పెడుతున్నాయి. ఢిల్లీలో ఒక్కరోజే కిలో రేటు రూ.3,000 ఎగిసి రూ.93,000ను తాకింది. పారిశ్రామిక రంగం, నాణేల తయారీదారులు, సాధారణ కొనుగోలుదారుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమవుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక హైదరాబాద్‌లోనూ కిలో వెండి ధర బుధవారం రూ.3,000 పెరిగింది. దీంతో రూ.97,000 నుంచి లక్ష రూపాయలపైనే పలుకుతున్నట్టు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఫ్యూచర్ మార్కెట్లో కూడా గోల్డ్ బుల్ రన్ సాగుతున్నది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎంసీఎక్స్‌పై అక్టోబర్ గోల్డ్ కాంట్రాక్ట్స్ 10 గ్రాము లు రూ.76,000 పలికింది. ఇక డిసెంబర్ నెలకుగాను సిల్వర్ కాం ట్రాక్ట్స్ కిలో రూ.91,974గా ఉన్నది.
గోల్డ్, సిల్వర్ రేట్లు గ్లోబల్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఔన్స్ గోల్డ్ ధర 2,681.10 డాలర్లకు చేరింది. ఒకానొక దశ లో రికార్డు స్థాయిలో 2,694.89 డాలర్లు పలకడం విశేషం. వెండి రేటు ఔన్స్ 32.15 డాలర్లుగా ఉన్నది. కాగా, బంగారం ధరలు అంతర్జాతీయ విపణిలో ఔన్స్ 3,200 డాలర్లను తా కే వీలున్నట్టు భారతీయ బులియన్, జ్యుయెల్లర్ల సంఘం (ఐబీజేఏ) కార్యదర్శి సురేంద్ర మెహెతా అంటున్నారు. ఈ అంచనాతో దేశీయ మార్కెట్లో పసిడి ధరల పరుగు ఇకపైనా కొనసాగుతుందని స్పష్టమవుతున్నది.
రాబోయేది పండుగ సీజన్ కావడంతో బంగారం, వెండి ధరలు ఇంకా పెరుగుతాయన్న అంచనాలు మార్కెట్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దీపావళికి కొత్త రికార్డులు నమోదవడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు ఆల్‌టైమ్ హైల్లో ఉండటంతో మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం పసిడి వైపునకు కొంతమేర ఇన్వెస్ట్మెంట్లు తరలిస్తున్నారని, దీంతో ఒకవేళ మార్కెట్ క్రాష్ అయితే పుత్తడి రేట్లు మరింత పెరుగవచ్చన్న అంచనాలూ ఉన్నాయి. ఇక నగల వర్తకులు నిరంతరం బంగారం కొనుగోళ్లకు దిగుతుండటం కూడా డిమాండ్‌ను పెంచి మార్కెట్లో ధరల్ని పెంచుతున్నాయని ట్రేడర్లు తాజా ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు.