న్యూఢిల్లీ, జనవరి 5: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు.. దేశ, విదేశీ మార్కెట్లలో రేట్లను ఎగదోస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ కమోడిటీ మార్కెట్‌ను వెనెజువెలాపై అమెరికా సైనిక చర్య పెద్ద ఎత్తునే ప్రభావితం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.1,40,400 పలికింది. గతంతో పోల్చితే రూ.960 పుంజుకున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం రేటు రూ.1,26,500గా నమోదైంది.
వెండి ధర ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,44, 000 గా నమోదైంది. ఈ ఒక్కరోజే రూ.2,600 ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లో రూ.2,46,000గా ఉన్నది. సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమ వర్గాల నుంచి వెండికి ఆదరణ పెరుగుతున్నదని అఖిల భారత సరఫా అసోసియేషన్ చెప్తున్నది. కాగా, వెనెజువెలాపై అమెరికా దాడులు.. సముద్ర మార్గం ద్వారా జరిగే వెండి ఎగుమతుల్ని దెబ్బతీసిందని, ఇది మరింతగా ధరల పెరుగుదలకు దారితీస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 87.74 డాలర్లు లేదా 2.03 శాతం ఎగసి 4,418.24 డాలర్లకు చేరింది. సిల్వర్ రేటు 2.35 డాలర్లు లేదా 3.24 శాతం పెరిగి 75.02 డాలర్లను చేరింది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న క్రమంలో మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం.. గోల్డ్, సిల్వర్ వైపునకు కదులుతున్నారని, ఇది కూడా ధరలను ఎగదోస్తున్నదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.