Gold Price | న్యూఢిల్లీ, నవంబర్ 7: రికార్డులతో హోరెత్తిస్తూ వేగంగా పెరుగుతూపోయిన బంగారం, వెండి ధర లు.. అంతే త్వరగా కిందికి దిగొస్తున్నాయి. గురువారం ఒక్కరోజే తులం పసిడి విలువ హైదరాబాద్ మార్కెట్లో రూ.1,790 పడిపోయింది. రూ.80వేల మార్కుకు దిగువన ముగిసింది. ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.2,900 పతనమైంది. స్థానిక జ్యుయెల్లర్స్ నుంచి డిమాండ్ మందగించడమే ఈ ధరల క్షీణత వెనుక ఉన్న ప్రధాన కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాలూ దేశీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గత గురువారం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి ధర మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ. 82,400 పలికింది. అయితే ఈ గురువారం రూ. 79, 500కు పరిమితమైంది. ఈ ఒక్కరోజే రూ.1,650 తగ్గుముఖం పట్టగా, గడిచిన వారం రోజుల్లో రూ.2,900 దిగినైట్టెంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ పసిడి తులం ధర రూ.1,790 పడిపోయి రూ.78,560 వద్ద నిలిచింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత లేదా బంగారు ఆభరణాలు) రూ.1,650 తగ్గి రూ.72,000గా ఉన్నది.
బంగారంతోపాటు వెండి ధరలూ వెలవెలబోతున్నాయి. గురువారం ఢిల్లీలో కిలో ధర రూ.2,900 దిగజారి రూ.93,800గా నమోదైంది. ముఖ్యంగా నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి ఆదరణ కరువైంది. వారం, పది రోజుల క్రితం గరిష్ఠంగా లక్షా 2,000 రూపాయలు పలికిన వెండి రేటు.. రూ.8వేలకుపైగా తగ్గినైట్టెంది. సాధారణ కస్టమర్లు ధరలు ఎక్కువగా ఉండటంతో బంగా రం, వెండి కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారని, అందుకే డిమాండ్ పడిపోయిందని వర్తకులు చెప్తున్నారు. కాగా, ధరలు ఇలా పడిపోతున్నా వ్యాపారం సాగదని, ఎక్కడో ఓచోట ధరలు స్థిరంగా ఉంటేనే విక్రయాలు బాగుంటాయని వారు పేర్కొంటున్నారు.
గ్లోబల్ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు నేలచూపుల్నే చూస్తున్నాయి. 1.90 డాలర్లు పడిపోయి ఔన్సు బంగారం ధర 2,674.40 డాలర్లుగా ఉన్నది. వెండి 31.26 డాలర్లు పలికింది. ఇక దేశీయంగా ఫ్యూచర్ మార్కెట్ విషయానికొస్తే.. డిసెంబర్ డెలివరీకిగాను పసిడి కాంట్రాక్టుల విలువ ఎంసీఎక్స్‌లో తులం రూ.76,655గా నమోదైంది. వెండి కిలో రూ.90,811 పలికింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం, వెండి నుంచి తిరిగి ఈక్విటీలు, బాండ్ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారని, అందుకే గోల్డ్, సిల్వర్ మార్కెట్లలో ఈ కరెక్షన్ ఉందని ఎక్స్పర్ట్ అభివర్ణిస్తున్నారు. దీంతో మున్ముందు ధరల్లో మరింత దిద్దుబాటుకు అవకాశాలూ లేకపోలేదని చెప్తున్నారు. ఇక ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నట్టు విశ్లేషిస్తున్నారు.