Gold-Silver Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆకాశన్నంటిన ధరలతో సామాన్యులు బంగారమంటేనే బెంబేలెత్తిపోతున్నారు. గత మూడురోజుల కాస్త ఊరటనిచ్చిన ధరలు తాజాగా.. ఒకేరోజు అమాంతం పెరిగాయి. మూడురోజుల నష్టాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.3500 పెరిగి తులం రూ.1,28,900కి పెరిగిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.3500 పెరిగి తులానికి రూ.1,28,300కి చేరుకుంది. ఇక వెండి సైతం బంగారం బాటలో దూసుకుపోతున్నది. ఒకే రోజుకు రూ.5,800 పెరిగి.. కిలో ధర రూ.1,60,800కి పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో స్థానిక ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ప్రధాన కరెన్సీలతో పోలిస్తే యూఎస్ డాలర్ బలహీనపడడం బంగారం ధరల పెరుగుదలకు దారి తీసిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. విదేశీ మార్కెట్లో ఔన్సు బంగారం 0.09 శాతం తగ్గి 4,131.09 డాలర్లకు చేరుకుంది. ఇక వెండి 0.40 శాతం తగ్గి ఔన్సుకు 51.15కి తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన ట్రెండ్ మధ్య మంగళవారం ఫ్యూచర్స్ ట్రేడ్లో బంగారం ధరలు రూ.1,458 పెరిగి రూ.125,312కి చేరాయి. వచ్చే నెలలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే అంచనాలు మరింత పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ 1.18 శాతం పెరిగి రూ.1,25,312కి చేరుకుంది.
అలాగే, సిల్వర్ ఫ్యూచర్స్ కొనుగోళ్ల కారణంగా.. డిసెంబర్లో డెలివరీకి వెండి ధర 1.67 శాతం పెరిగి కిలోకు రూ.1,57,065కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో డిసెంబర్లో డెలివరీకి కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 47.8 పెరిగి 4,142 డాలర్లకు చేరింది. డిసెంబర్లో డెలివరీకి కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 1.94 శాతం పెరిగి ఔన్సుకు 51.30 డాలర్లకు పెరిగింది. రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది మాట్లాడుతూ.. మంగళవారం బంగారం ధరలు ఔన్సుకు 4,140 డాలర్లకు చేరిందన్నారు. గత సెషన్తో పోలిస్తే లాభాలను నమోదు చేశాయన్నారు. ఫెడ్ వైఖరి నేపథ్యంలో వచ్చే నెలలో వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు పెరిగాయన్నారు.
డిసెంబర్లో 25 బేసిస్ పాయింట్ల రేటు కోత అవకాశం 81 శాతం ఉంటుందని ట్రేడర్స్ ఆశిస్తున్నారని.. వారం కిందట 40 శాతం నుంచి గణనీయంగా పెరిగిందని త్రివేది తెలిపారు. డాలర్ ఇండెక్స్ స్థిరంగా ఉందని, 100 మార్కుపైన ట్రేడవుతోందని.. రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై అంచనాలు బంగారం, వెండి లాభాలను పరిమితం చేస్తోందని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి అన్నారు. బులియన్ ధరల భవిష్యత్తుపై అంచనా వేయడానికి పెట్టుబడిదారులు కీలకమైన యూఎస్ డేటా కోసం ఎదురు చూస్తున్నారని రిలయన్స్ సెక్యూరిటీస్ త్రివేది చెప్పారు. సెప్టెంబర్ రిటైల్ అమ్మకాలు, ఉత్పత్తిదారుల ధరల సూచిక (PPI) డేటా, నిరుద్యోగ వాదనలు అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య విధానంపై ఫెడ్ వైఖరి ఎలా ఉండబోతుందో తెలుస్తుందన్నారు.