Godrej | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. మొత్తం 180 ఎకరాలు అవసరం కాగా ఇప్పటికే టీజీఐఐసీ 114 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, మిగతా 65 ఎకరాల స్థలానికి నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు.
ఈ స్థలాన్ని త్వరితగతిని పూర్తి చేయాలని మంత్రిని కోరారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో కంపెనీ ప్రతినిధులు మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆయిల్ పాం ప్రాసెసింగ్ మిల్లు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అదేవిధంగా ఈ ఏడాది 15 వేల ఎకరాల పైన ఆయిల్ పాం సాగు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని, తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని లక్ష్యాన్ని సాధించాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం కావలన్నా అందిస్తామని తెలియజేశారు.