హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని సాధించింది. ఇండియా అండ్ సౌత్ ఏషియా విభాగంలో ‘బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ 2025’ అవార్డు నాలుగోసారి అందుకుంది. ఇది ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో, అతిథి సేవలు, కార్యకలాపాల్లో సమర్థతకు గుర్తింపుగా అందించారు.
ఈ అవార్డును కంపెనీ సీఈవో ప్రదీప్ ఫణికర్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఇది మా సిబ్బంది, భాగస్వాముల అంకితభావం, ఆతిథ్యానికి ప్రతీకలాంటిదని, ప్రతి ఒక్కరూ ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. మేము వారి అవసరాలను ముందుగానే అంచనా వేసి, వ్యక్తిగత శ్రద్ధతో గుర్తుండిపోయే అనుభవాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.