న్యూఢిల్లీ, జూలై 24: జీఎమ్మార్ గ్రూప్‌లోని జీఎమ్మార్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ (జీపీయూఐఎల్).. తమ అనుబంధ సంస్థ జీఎమ్మార్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉత్తరప్రదేశ్‌లో రూ.7,593 కోట్ల విలువైన స్మార్ట్ మీటర్ ఇన్‌స్టాలేషన్స్ ప్రాజెక్టును గెల్చుకున్నట్టు సోమవారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్) కింద ఈ ప్రాజెక్టును పొందినట్టు వెల్లడించింది.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా దక్షిణాచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ (డీవీవీఎన్ఎల్), పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ (పీయూవీవీఎన్ఎల్) డిస్కంల పరిధిలో జీఎమ్మార్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనున్నది. వారణాసి, ప్రయాగ్ రాజ్, ఆగ్రా, మథుర, అలీగఢ్ తదితర 22 జిల్లాల్లో ఈ ప్రాజెక్టు అమలు కానున్నది. ఈ ప్రాజెక్టు జీఎమ్మార్ చిత్తశుద్ధికి నిదర్శనమని ఈ సందర్భంగా జీఎమ్మార్ గ్రూప్ ఎనర్జీ విభాగం చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల అన్నారు.