IMF on Recession | ఈ ఏడాది యావత్ ప్రపంచ మానవాళికి కష్టకాలమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిష్టాలినా జార్జివా హెచ్చరించారు. గ్లోబల్ గ్రోత్‌కు ప్రధాన చోదకశక్తులుగా ఉన్న అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), చైనాల్లో ఆర్థిక లావాదేవీలు బలహీనపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచమంతా `ఆర్థిక మాంద్యం` ముప్పులోకి వెళుతుందని ఒక ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అమెరికా, చైనా, ఈయూ మినహా ఇతర దేశాల ప్రజలు కూడా ఇబ్బందుల పాలవుతారని అన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు కంటే చైనా వృద్ధిరేటు తక్కువగా నమోదవుతుందన్నారు. వచ్చే రెండు నెలలు చైనాలో గడ్డు పరిస్థితులు నెలకొంటాయని క్రిస్టాలినా ఆందోళన వ్యక్తం చేశారు.
పది నెలలు గడుస్తున్నా ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్నది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ధరల కట్టడికి వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడం, చైనాలో మళ్లీ కొవిడ్-19 కేసుల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. చైనాలో కొవిడ్ పరిస్థితి నూతన దశకు చేరుకున్నదని, సవాళ్లు పొంచి ఉన్నాయని ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించిన మరునాడే క్రిస్టాలినా స్పందించడం గమనార్హం.
2023 ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు అంచనాలను ఇప్పటికే ఐఎంఎఫ్ సవరించేసింది. 2021లో ఆరుశాతంగా ఉన్న గ్లోబల్ గ్రోత్.. 2022లో 3.2 శాతానికి పడిపోగా, ఈ ఏడాది 2.7 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేసింది. 2008 ఆర్థిక మాంద్యం, కొవిడ్ పరిస్థితులు మినహాయిస్తే 2001 తర్వాత అత్యంత కనిష్ట వృద్ధిరేటు రికార్డు కానుండటం ఇదే మొదటిసారవుతుందని స్పష్టం చేసింది.