హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : లైఫ్‌సైన్సెస్ రంగంలోనూ కృత్రిమ మేధస్సు (ఏఐ) శరవేగంగా విస్తరిస్తోంది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా పొంచి ఉన్న ప్రాణాంతక వ్యాధులను జన్యు శాస్త్రం సాయంతో నిర్మూలించే అధ్యయనంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కీలకంగా మారుతున్నదిప్పుడు. జెనోమిక్స్ ఆధారంగా పర్సనలైజ్డ్ మెడిసిన్ ఆవిష్కరణలో దూసుకుపోతున్న హైదరాబాదీ ఏఐ-ఆధారిత జీనీపవరెక్స్.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంజీఐ టెక్ కంపెనీ లిమిటెడ్‌కు కీలక భాగస్వామిగా మారింది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో జన్యుశాస్త్ర అధ్యయనంలో ఎన్నో అంతు చిక్కని, సుదీర్ఘకాలంగా వేధించే మొండి వ్యాధులకు కూడా సులభమైన రీతిలో కచ్చితత్వంతో పనిచేసే మందులను తయారు చేసే వీలుంటుంది. అత్యాధునిక సీక్వెన్సింగ్, ఏఐ ఆధారిత విశ్లేషణ, ప్రెడిక్టివ్ హెల్త్‌కేర్, ప్రెసిషన్ మెడిసిన్, దీర్ఘకాలిక వ్యాధులపై అధ్యయనంలో ఈ సంస్థల భాగస్వామ్యం కీలక మలుపు కానుంది.
అత్యంత ప్రభావవంతంగా పనిచేసే పర్సనలైజ్డ్ మెడిసిన్ తయారీ, క్లినికల్ గ్రేడ్ జన్యు సేవలు, జన్యు శాస్త్రం, బయో ఇన్ఫర్మేటిక్స్ వంటి అంశాల్లో ఈ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించనున్నాయి. ఏఐ ఆధారిత డేటా, సీక్వెన్ ప్లాట్ఫారంలను కలిగిన ఎంజీఐతో కలిసి పనిచేయడంలో జన్యుశాస్త్రంతో కూడిన వ్యక్తిగత వైద్య సేవల్లో గేమ్ ఛేంజర్‌గా మారుతుందని జీనీపవరెక్స్ వ్యవస్థాపకులు డా. కళ్యాణ్ రామ్ ఉప్పలూరి తెలిపారు. ఎంజీఐ వద్ద ఉన్న అత్యంత బలమైన సీక్వెన్సింగ్ ఫ్లాట్‌ఫారంలను తమవద్ద ఉన్న ఏఐ ఆధారిత టెక్నాలజీతో సమ్మిళతం చేయనున్నట్టు చెప్పారు. దీంతో మరింత కచ్చితత్వంతో, లోతైన వివరణాత్మక ఫలితాలను పొందడానికి వీలుంటుందని, దీంతో సకాలంలో ఆరోగ్య సంరక్షణకు నివారణ పరిష్కారాలను పొందవచ్చని జీనీపవరెక్స్ ఎండీ డా. హిమ జ్యోతి చల్లా పేర్కొన్నారు. అనంతరం ఎంజీఐ టెక్ కంపెనీ ఆసియా-పసిఫిక్ జీఎం రాయ్ టాన్ మాట్లాడుతూ.. ‘పర్సనలైజ్డ్ మెడిసిన్‌లో వైద్య సేవలు అందించడంలో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలకపాత్రను పోషించనుంది. జీనీపవరెక్స్ వద్ద ఉన్న వినూత్న ఏఐ ఆధారిత విశ్లేషణలతో అధునాతన జన్యు సాంకేతికతలను అనుసంధానం చేయడం వలన ఊహించని స్థాయిలో సత్ఫలితాలు పొందే వీలుంటుంది’ అన్నారు.
హైదరాబాద్‌కు చెందిన జీనీపవరెక్స్ దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత జెనోమిక్ హెల్త్‌కేర్ సేవలను అందిస్తోంది. నాన్-కమ్యూనికెబుల్ వ్యాధుల నివారణకు అవసరమైన వైద్య సేవలను అందించడంలో జీనీపవరెక్స్ ప్రసిద్ధి చెందింది. గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు, ఫార్మాకో జెనోమిక్స్, దీర్ఘకాలిక, జీవనశైలి సంబంధిత వ్యాధుల స్థితిగతులను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేస్తూ అధునాతన వైద్యానికి అవసరమైన టెక్నాలజీని అందిస్తోంది. అదేవిధంగా సింగపూర్ కేంద్రంగా 6 ఖండాల్లో విస్తరించిన ఎంజీఐ టెక్ కంపెనీ లిమిటెడ్ సంస్థ.. లైఫ్‌సైన్స్ ఆర్అండ్డీ అంశాల్లో అగ్రగామిగా ఎదిగింది. అత్యంత సమర్థవంతమైన క్లినికల్ గ్రేడ్ జీన్ సీక్వెన్సర్లను స్వతంత్రంగా అభివృద్ధి చేసి, భారీగా ఉత్పత్తి చేయగల కొన్ని సంస్థలలో ఎంజీఐ ఒకటి. కాగా, జన్యుశాస్త్ర పరిశోధనలో ఈ రెండు సంస్థల కలయికతో హైదరాబాద్‌కు చెందిన జీనీపవరెక్స్ అంతర్జాతీయ స్థాయిలో జన్యు సంబంధిత సేవలను అందించే సంస్థగా నిలవనుంది.