న్యూఢిల్లీ, నవంబర్ 13: ప్రస్తుత 2023-24, వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో భారత్ జీడీపీ 6.5 శాతం చొప్పున వృద్ధిచెందుతుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. పటిష్ఠమైన కార్పొరేట్, ఫైనాన్షియల్ రంగం బ్యాలెన్స్ షీట్స్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం పెద్దగా లేదంటూ మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ విడుదల చేసిన ‘2024 ఇండియా ఎకనామిక్ అవుట్‌లుక్’లో వివరించింది. దేశీయ డిమాండ్ భారత వృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నదని పేర్కొంది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.7 శాతం పెరుగుతుందని అంచనా వేయగా, ఐఎంఎఫ్ 6.3 శాతం వృద్ధి అంచనాల్ని ప్రకటించింది. రిజర్వ్‌బ్యాంక్ అంచనా 6.5 శాతంగా ఉంది.
వచ్చే జూన్ తర్వాత ఆర్బీఐ రేటు తగ్గొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉండవచ్చని, అటుతర్వాత 2024-25లో 4.9 శాతానికి తగ్గవచ్చని ఇన్వెస్ట్మెంట్ అంచనాల్లో పేర్కొంది. అలాగే సర్వీసుల నికర ఎగుమతులు పెరుగుతాయని, దీంతో కరెంటు ఖాతాలోటు 1.5-1.7 శాతానికి పరిమితం కావచ్చని మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ తెలిపింది. భారత్ బాండ్లను జేపీ మోర్గాన్ డెట్ ఇండెక్స్‌లో చేర్చడంతో మరిన్ని విదేశీ పెట్టుబడులు వస్తాయని, తద్వారా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పరిస్థితి మెరుగుపడుతుందని వివరించింది. 2024 ప్రధమార్థం వరకూ వడ్డీ రేట్లను రిజర్వ్‌బ్యాంక్ యథాతథంగా ఉంచవచ్చని, 2024 జూన్ నుంచి రేట్లను తగ్గించవచ్చని అంచనా వేసింది. అయితే చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు బలహీనపడటం భారత్ ఆర్థిక స్ఙిరత్వానికి రిస్క్‌లని హెచ్చరించింది.