Gayatri Bank | జగిత్యాల, మే 22 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల కేంద్రంగా 25 ఏండ్ల క్రితం చిన్నగా ఏర్పాటైన గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్.. నేడు రెండు తెలుగు రాష్ర్టాల్లో శాఖలను విస్తరించి తన సత్తాను చాటుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, హైదరాబాద్ సమత మహిళా కో-ఆపరేటివ్ బ్యాంక్, భువనగిరికి చెందిన యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి కో-ఆపరేటివ్ బ్యాంకులను విలీనం చేసుకొని దిగ్విజయంగా ముందుకు సాగుతున్నది. త్వరలోనే మహారాష్ట్రలోని ముంబై, పుణె లాంటి నగరాల్లోనూ శాఖల ఏర్పాటుకు బ్యాంక్ సిద్ధమవుతోంది. రెండున్నర దశాబ్దాల్లో 62 బ్యాంకింగ్ అవార్డులను కైవసం చేసుకోవడం ఖాతాదారుల్లో గాయత్రి బ్యాంక్ విశ్వసనీయతకు అద్దం పడుతున్నది.
కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో చిన్న ఉద్యోగం కోసం ఆశపడిన యువకుడు.. ఓ బ్యాంక్ ప్రారంభానికే పూనుకున్నాడు. జగిత్యాల వాసులు ఇచ్చిన సహాయ,సహకారాలతో ఏర్పడిన కో-ఆపరేటివ్ బ్యాంక్.. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంక్‌గా పేరు సంపాదించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏటా చిన్న బ్యాంకులకు ఇచ్చే పురస్కారాన్ని వరుసగా 19సార్లు సాధించి అత్యుత్తమ సేవలకు చిరునామాగా నిలవడం గమనార్హం. ప్రస్తుతం గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ రెండు తెలుగు రాష్ర్టాల్లో 62 బ్రాంచ్‌లతో రూ.27 కోట్ల లాభాలతో, 900 మంది ఉద్యోగులతో పురోగమిస్తోంది. ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసిన వనమాల శ్రీనివాస్.. చివరకు జగిత్యాలలోనే కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం విశేషం. 1998 డిసెంబర్ 31న గాయత్రి బ్యాంక్‌కు ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చింది. అలా.. 1,008 మంది ఖాతాదారులతో, రూ.25.08 లక్షల మూలధనం (షేర్ క్యాపిటల్)తో 11 సెప్టెంబర్ 2000వ సంవత్సరంలో బ్యాంక్ ప్రారంభమైంది. అప్పట్లో బ్యాంక్ అధ్యక్షుడిగా ముత్యాల లక్ష్మణ్ రెడ్డి, సీఈవోగా వనమాల శ్రీనివాస్, మరో ఐదుగురు ఉద్యోగులు పనిచేసేవారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు కో-ఆపరేటివ్ బ్యాంకులు బోర్డులను తిప్పేస్తున్న తరుణంలోనూ గాయత్రి బ్యాంక్ నిలదొక్కుకోవడం విశేషం. ఖాతాదారుల్లో భరోసాను నింపి అంచలంచెలుగా ఎదిగింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బ్యాంకు పనివేళలుగా నిర్ణయించడం కలిసొచ్చింది. దాంతోపాటు అతి తక్కువగా డీడీ కమిషన్‌ను తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే బ్యాంకులో కేవలం పోస్టల్ చార్జీలతోనే చెక్ క్లియరెన్స్‌లను కల్పించారు. నిమిషాల వ్యవధిలో కొత్త ఖాతాలను అందించడం సైతం కస్టమర్లను ఆకర్షించింది. ఖాతాదారులకు గాయత్రి నిర్భయ సేవింగ్స్ అకౌంట్ ద్వారా రూ.లక్ష ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ సౌకర్యం కూడా ఉన్నది.
జగిత్యాలలో ప్రారంభమైన గాయత్రి బ్యాంక్.. తెలుగు రాష్ర్టాలతోపాటు, ఇతర రాష్ర్టాల్లోనూ విస్తరిస్తుండటం సంతోషకరం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆదాయం పెరగడం, వ్యాపార-వాణిజ్య రంగాలకు, పరిశ్రమలకు ప్రభుత్వం పెద్దపీట వేయడంతో గొప్ప ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలోనే బ్యాంకుల ప్రాధాన్యత పెరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండేలా సేవలు అందించడంతో గాయత్రి బ్యాంక్‌పై నమ్మకం ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వరాష్ట్ర ఏర్పాటు మా బ్యాంక్‌కు స్వర్ణయుగాన్ని తెచ్చింది.