న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ మళ్లీ మూడో స్థానంలోకి వచ్చారు. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు వారాలు లాభాల్లో కదలాడుతుండటం కలిసొచ్చింది. ఈ క్రమంలోనే జెఫ్ బెజోస్‌ను మరోమారు వెనక్కినెట్టి రియల్ టైం బిలియనీర్లలో టాప్ 3లోకి అదానీ దూసుకొచ్చారు. అమెజాన్ షేర్లు నష్టపోతుండటం బెజోస్ సంపదను తగ్గించేస్తున్నాయి. కాగా, సోమవారం అదానీ సంపద 314 మిలియన్ డాలర్లు ఎగిసి 131.9 బిలియన్ డాలర్లకు చేరింది. బెజోస్ సంపద 126.9 బిలియన్ డాలర్లుగా ఉన్నది. అదానీ కంటే ముందు స్థానాల్లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ (156.5 బిలియన్ డాలర్లు), ఎలాన్ మస్క్ (223.8 బిలియన్ డాలర్లు) ఉన్నారు. కాగా, గ్రీన్ ఎనర్జీ, డాటా సెంటర్లు, విమానాశ్రయాలు, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో 150 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను అదానీ గ్రూప్ పెట్టనున్నది. కేవలం గడిచిన ఏడేండ్లలోనే అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 16 రెట్లకుపైగా ఎగబాకడం గమనార్హం. 2015లో దాదాపు 16 బిలియన్ డాలర్లుగానే ఉన్నది. మరోవైపు ఈ ఏడాది సుమారు 260 బిలియన్ డాలర్లు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచే ఈ పెరుగుదల అన్న వార్తలూ వస్తున్న సంగతి విదితమే.