హైదరాబాద్, మే 12: గతేడాది ఆరోగ్య బీమా సేవలు ఆరంభించిన గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్..దక్షిణాదిలో వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్లో తన ప్రాంతీయ కార్యాలయాన్ని తెరిచింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో ఉన్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్టు కంపెనీ ఎండీ, సీఈవో జీ శ్రీనివాసన్ తెలిపారు.
గడిచిన కొన్ని నెలల్లోనే రూ.17 కోట్ల ప్రీమియం వసూళ్లు చేసినట్టు, వచ్చే మార్చి నాటికి ఇది రూ.200 కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే ఆరోగ్య బీమాకు సంబంధించి ప్రస్తుతం ఏడు పాలసీలను విక్రయిస్తున్న సంస్థ..వచ్చే మార్చిలోగా మరో 10 కొత్త పాలసీలను ఆవిష్కరించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం 6 వేల మంది ఏజెంట్లు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి వీరిని 60 వేలకు పెంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.