హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ20 వేదికగా నిలుస్తున్నదని సభ్య దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అన్నీ డిజిటల్ చెల్లింపులే ఉంటాయని, కాబట్టి వీటిపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో గత నాలుగు రోజులుగా జరుగుతున్న జీ20 దేశాల ఆర్థిక సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (జీపీఎఫ్ఐ) సమావేశంలో భారత్, ఇటలీకి సంబంధించిన కో-చైర్మన్లను ఎన్నుకున్నారు.
మూడేండ్లపాటు వారు జీపీఎఫ్ఐపై సలహాలు, సూచనలు అందిస్తారు. కాగా, ఈ నెల 4, 5 తేదీల్లో గ్లోబల్ సౌత్‌లోని ఎమర్జింగ్ ఎకానమీల కోసం నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. జీ20 ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హాజరయ్యారు. తెలంగాణలోని టీ-వాలెట్, తదితర అంశాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ సందర్భంగా వివరించారు. 6, 7 తేదీల్లో జీపీఎఫ్ఐ సమావేశాలు జరిగాయి. ఆయా దేశాలు, రీజినల్ ఆర్గనైజేషన్స్, గ్లోబల్ బ్యాంక్‌ల ప్రతినిధులు, నిపుణులు వచ్చారు.