Future-Amazon | దేశీయ రిటైల్ దిగ్గజం ఫ్యూచర్ రిటైల్.. రుణ దాతలకు రూ.3494.56 కోట్ల వాయిదా చెల్లింపు గడువు మిస్ అయింది. వన్‌టైం పునర్వ్యవస్థీకరణ ఒప్పందం ప్రకారం గత నెల 31 లోపు ఈ రుణ వాయిదాను చెల్లించాల్సి ఉందని, కానీ అమెజాన్‌తో వివాదం వల్ల జాప్యమైందని స్టాక్ ఎక్స్చేంజ్కు పంపిన నోటీసులో తెలిపింది. అప్పుల ఊబిలో చిక్కుకున్న ఫ్యూచర్ రిటైల్ అధినేత కిశోర్ బియానీ.. ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్‌లో విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.
కానీ అంతకుముందే 2019లో ఫ్యూచర్ కూపన్స్‌లో పెట్టుబడుల సందర్భంగా భవిష్యత్‌లో తమకే గ్రూప్ బిజినెస్‌ను విక్రయించాలన్న నిబంధనను ఫ్యూచర్ గ్రూప్‌తో కుదుర్చుకున్నది అమెజాన్. దీనిపై అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఎమర్జెన్సీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా తుది తీర్పు వెలువరించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే రుణ దాతల రుణ వాయిదాల చెల్లింపునకు ఫ్యూచర్ రిటైల్.. బ్యాంకులతో వన్‌టైం పునర్వ్యవస్థీకరణ ఒప్పందం (ఏటీఎస్) కుదుర్చుకున్నది. ఓటీఆర్ నిబంధనల ప్రకారం ఫ్యూచర్ గ్రూప్‌కు మరో నెల రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.