Rules Change | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో మాసం ముగిసింది. రేపటి నుంచి జులై ప్రారంభం కానున్నది. అయితే, జులై ఒకటి నుంచి పలు కీలక రూల్స్ మారబోతున్నాయి. ఇవి సామాన్యుల దైనందిన జీవితం, ఖర్చులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనున్నది. ఇందులో పాన్‌కార్డ్ నుంచి బ్యాంకింగ్, రైల్వే టికెట్ బుకింగ్, గ్యాస్ సిలిండర్ ధర, క్రెడిట్ కార్డుల వరకు రూల్స్ ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తే మీ జేబులపై భారం పడొచ్చు. కొన్ని సందర్భాల్లోనూ ఊరట కలిగించే అవకాశాలున్నాయి. అయితే, జులై ఒకటి నుంచి మారనున్న రూల్స్ ఏంటో ఓసారి చూద్దాం..!
జులై ఒకటి నుంచి రైలు టికెట్ చార్జీలు పెరగనున్నాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ క్లాస్ చార్జీలను పెంచేందుకు రైల్వేమంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నది. నాన్ ఏసీ (స్లీపర్, సెకండ్ సీటింగ్) కేటగిరిల్లో టికెట్‌పై కిలోమీటర్‌కు ఒక పైసా, థర్డ్ ఏసీ నుంచి ఫస్ట్ ఏసీ వరకు అన్ని క్లాస్‌లలో కిలోమీటర్‌కు 2 పైసలు పెరుగనున్నది. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి సెకండ్ క్లాస్ రైలు టికెట్ల ధరలు, ఎంఎస్‌టీలో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ, 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే.. ఆ ప్రయాణికులు ప్రతి కిలోమీటర్‌కు అర పైసా చెల్లించాల్సి ఉంటుంది.
రైల్వేశాఖ జులై ఒకటి నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్‌ను కఠిన తరం చేసింది. ఇకపై తత్కాల్ టికెట్లు ఐఆర్సీటీసీ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసిన ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. జులై ఒకటి నుంచి ఓటీపీ ఆధారిత అథంటికేషన్ తప్పనిసరి చేసింది. దాంతో ఆధార్ అకౌంట్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన మొదటి అరగంటలో రైల్వే ఏజెంట్లు బుకింగ్ చేసేందుకు అనుమతి ఉండదు. ఏజెంట్లు పెద్ద ఎత్తున టికెట్లను బుక్ చేస్తున్నారని విమర్శల నేపథ్యంలో ఐఆర్సీటీసీ ఈ నిర్ణయం తీసుకున్నది. దాంతో ప్రయాణికులకు ఊరట కలుగనున్నది.
పాన్ కార్డుల రూల్స్ సైతం మారబోతోన్నాయి. జులై ఒకటి నుంచి కొత్త పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు కాపీని అందించడం తప్పనిసరి. సీబీడీటీ ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నది. మీకు ఇప్పటికే పాన్, ఆధార్ కార్డు ఉంటే.. వాటిని లింక్ చేయడం తప్పనిసరి. ఈ రెండింటిని అనుసంధానించేందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అనుమతి ఇచ్చింది.
అన్ని రకాల క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు కోసం కొత్త వ్యవస్థ అందుబాటులోకి రాబోతున్నది. భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ (BBPS) వ్యవస్థ ద్వారానే అన్ని క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఈ నిర్ణయంతో బిల్ డెస్క్, ఫోన్‌పే, క్రెడ్ వంటి యాప్‌లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎనిమిది బ్యాంకులు మాత్రమే బీబీపీఎస్ సౌకర్యాన్ని ప్రారంభించాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంతో పాటూ యూపీఐ లావాదేవీలపై విధించే చార్జీల్లో మార్పులు చేసింది. ఇకపై కస్టమర్స్ ఐసీఐసీ బ్యాంక్ ఏటీఎంని ఉపయోగిస్తే పరిమితి దాటిన తర్వాత చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రతి నెలా మూడు లావాదేవీలు, చిన్న నగరాల్లో ప్రతి నెలా ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం. ఆ తర్వాత జరిపే ప్రతి ఒక్క లావాదేవీకి రూ.23 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేస్తే.. అదనంగా సేవలు ఉపయోగించుకున్నా ప్రతి ఒక్కదానికి రూ.8.5 వసూలు చేయనున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎం రూల్స్‌లో మార్పులు చేసింది. బ్యాంక్ యూజర్లు ప్రతి నెలలో ఐదుసార్లు మాత్రమే ఉచితంగా నగదును ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పరిమితి దాటితే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్‌కు ఛార్జీలు విధిస్తుంది. మెట్రో పాలిటన్ నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆ తర్వాత లిమిట్ దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.23తో పాటు జీఎస్టీని వసూలు చేయనున్నది. ఇతర సేవలకు రూ.8.50తో పాటు జీఎస్టీని వసూలు చేస్తుంది. అలాగే ఆన్లైన్ గేమింగ్ చార్జీల రూల్స్ మార్చింది. గేమింగ్ యాప్‌లలో నెలకు రూ.10వేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే అదనంగా ఒకశాతం అదనంగా చార్జీలు విధించనున్నది. Paytm వంటి థర్డ్ పార్టీ వాలెట్లకు రూ.10వేల కంటే ఎక్కువ బదిలీ చేస్తే ఇకశాతం చార్జీ విధించనున్నారు.
జూలై 2025 నుంచి జీఎస్టీ రిటర్న్ దాఖలులో జాప్యం, తప్పులపై కఠిన చర్యలు తీసుకోబోతున్నది కేంద్రం. జీఎస్టీఆర్-3బీ ఫారమ్‌కు సంబంధించి వస్తువుల సేవల పన్ను నెట్వర్క్ (GSTN) కీలకమైన అప్డేట్ని విడుదల చేసింది. జులై నుంచి ఈ ఫారమ్‌లో ఎలాంటి సవరణలు ఉండవు. అంటే దానిలో పన్ను వివరాలు జీఎస్టీఆర్-1, 1ఏ నుంచి ఆటోమెటిక్‌గా నింపబడతాయి. పన్ను చెల్లింపుదారులు ఇకపై దాన్ని సవరించేందుకు అవకాశం ఉండదు. పన్ను వ్యవస్థలో పారదర్శకత, ఖచ్చితత్వాన్ని తీసుకువచ్చే లక్ష్యంతో ఈ మార్పులు అమలులోకి తీసుకురాబోతున్నారు.
జులైలో ఎల్పీజీ సిలిండర్ రేట్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియను ప్రభుత్వం ప్రతి నెల ప్రారంభంలో స్వల్ప మార్పులు చేస్తుంటుంది. జూన్ ఒకటి 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే, గతేడాది ఆగస్టు నుంచి దేశీయ గ్యాస్ సిలిండర్ ధర అంటే.. 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు జరుగలేవు.