న్యూఢిల్లీ, జనవరి 13: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏలు)తో ఆయా దేశాల మధ్య సుంకాలు భారీగా తగ్గిపోతాయి. అందుకే మెజారిటీ దేశాలతో ఎఫ్టీఏలకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఇక ఈ ఎఫ్టీఏలను వ్యాపారాభివృద్ధికి చక్కని మార్గాలుగా, ధరల అదుపుతో వినియోగదారులకు మేలు చేకూర్చేవిగా, ఎగుమతిదారులకు కొత్త మార్కెట్లను పరిచయం చేసేవిగా తరచూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు అభివర్ణిస్తున్నదీ చూస్తూనే ఉన్నాం. అయితే అసలైన ఆర్థిక ఫలాలు అందాలంటే కేవలం టారిఫ్‌లు తగ్గితే చాలదు.. ఉత్పత్తి, పెట్టుబడులు, పోటీయుత మార్కెట్ కోణాల్లోనూ ప్రయోజనాలుండాలి. అప్పుడే ఎఫ్టీఏలకు అర్థం.. పరమార్థమని నిపుణులు పేర్కొంటున్నారు.
యూఏఈ, ఆస్ట్రేలియా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ), బ్రిటన్, న్యూజీలాండ్, ఒమన్ దేశాలతో భారత్ ఎఫ్టీఏలను కుదుర్చుకున్నది. అలాగే అమెరికాతో డీల్‌కు విశ్వ ప్రయత్నాలనే చేస్తున్న మోదీ సర్కార్.. కెనడాతోనూ సంప్రదింపులను మళ్లీ మొదలు పెట్టింది. అంతేగాక యూరోపియన్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, యూరేషియన్ ఎకనామిక్ యూనియన్లతోనూ ప్రాంతీయ స్థాయిలో చర్చలు జరుపుతున్నది. ముఖ్యంగా ప్రస్తుత భౌగోళిక-రాజకీయ అనిశ్చిత స్థితి నడుమ ఈ ఎఫ్‌టీఏలు దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తాయని కేంద్రం అంటున్నది.
ఎఫ్‌టీఏలతో భారత్ మిశ్రమ ఫలితాలనే ఎదుర్కొన్నదని ఎక్స్పర్ట్స్ గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ) పేరిట ఆసియా-పసిఫిక్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి భారత్ ఎప్పుడో తప్పుకొన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దేశంలోకి వెల్లువలా వచ్చే దిగుమతులతో ఆయా రంగాలు.. ప్రధానంగా వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాలు ప్రభావితమవుతాయన్న ఆందోళనలు అంతటా వ్యాపించడంతో భారత్ వెనక్కి తగ్గింది. నిజానికి ఈ ఒప్పందం కోసం తీవ్రంగా కృషి చేసిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే ఆ ఒప్పందం వల్ల భారత్‌కు జరిగే నష్టాలు తర్వాతగానీ మోదీ సర్కార్‌కు అర్థం కాలేదు. ముందూ వెనుక ఆలోచించకుండా ఒంటెత్తు పోకడతో నిర్ణయాలు తీసుకుంటే అంతర్జాతీయ సమాజం ఎదుట పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందన్న దానికి ఇదే నిదర్శనమని ట్రేడ్ విశ్లేషకులు చురకలంటిస్తున్నారు.
అభివృద్ధి చెందిన దేశాలతో అభివృద్ధి చెందుతున్న దేశాలు వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు అనేక కోణాల్లో పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. స్థానికంగా తయారీ, ఉత్పాదకతలను దృష్టిలో పెట్టుకొని విధానాలను రూపొందించుకోవాలి. నిజానికి భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. కాబట్టి రైతులకు మేలు జరిగేలా ఒప్పందాలు ఉంటేనే ఉపయోగకరం. కానీ భారత్ తొందరపాటు నిర్ణయాలతో ముందుకెళ్తున్నదన్న అప్రతిష్ఠ మూటగట్టుకుంటున్నదిప్పుడు. ఈ క్రమంలోనే అమెరికాతో ట్రేడ్ డీల్‌కు గట్టిగా మేధోమధనం చేస్తుండగా.. ట్రంప్ సర్కార్ నుంచి సుంకాల పోటు పెరుగుతున్నది. దీంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో.. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తాని భారత్ ఎఫ్‌టీఏ వ్యూహం.. ప్రభావవంతంగా, ఆచరణాత్మకంగా, ప్రయోజనకరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువని హెచ్చరిస్తున్నారు.
దేశంలో అధిక వ్యయంతో ఉత్పత్తి అవుతున్నవి.. ఎఫ్‌టీఏల వల్ల విదేశాల నుంచి చౌకగా రావడంతో ఆయా రంగాలన్నీ రోడ్డున పడాల్సి వస్తున్నది. వస్తూత్పత్తిలో చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు సాంకేతికంగా భారత్ కంటే ఎంతో ముందున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి నుంచి వచ్చే సరుకులు.. ఇక్కడి తయారీ రంగాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి ఎఫ్‌టీఏల కింద విదేశాలకు భారత్ నుంచి ఎగుమతయ్యేవి తక్కువగానే ఉంటున్నాయని, అంతకుమించి ఆయా దేశాల నుంచి భారత్‌కు ఎక్కువ మొత్తంలో దిగుమతి అవుతున్నాయని గుర్తుచేస్తున్నారు. ఒప్పందం కారణంగా వాటిపై సుంకాలు లేకపోవడంతో మార్కెట్లో చౌకగా లభిస్తున్నాయని, దీనివల్ల వినియోగదారులు వాటినే కొంటున్నారని వివరిస్తున్నారు. చివరకు భారతీయ ఇండస్ట్రీ కుంటుపడుతున్నదని, ఉద్యోగాలు పోతున్నాయని ఆవేదన వెలిబుచ్చుతుండటం గమనార్హం. కాగా, ఆయా దేశాలతో భారత్‌కు వాణిజ్యపరమైన వ్యత్యాసాలు పెద్ద ఎత్తునే కనిపిస్తుండటంతో చాలా ఎఫ్‌టీఏల సవరణకు మోదీ సర్కార్ డిమాండ్ చేస్తున్నది. అయితే ఇందుకు ఆయా దేశాలు అంత సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే సదరు ఒప్పందాల్లో మార్పులు ఇప్పుడున్న ప్రయోజనాలను కోల్పోయేలా చేస్తాయి మరి.