FPI Investments | బలహీనంగా కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ బలోపేతం కావడం, ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్ మీద రూపాయి మారకం విలువ పతనం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకూ రూ.22,194 కోట్ల నిధులను ఉపసంహరించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హయాంలో పన్నులు, దిగుమతి సుంకాల భారంపై ఆందోళన పెరిగిపోవడంతో విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి వాటాలు ఉపసంహరించారు.
2024 డిసెంబర్లో ఎఫ్‌పీఐలు స్టాక్ మార్కెట్లలో రూ.15,446 కోట్ల విలువైన వాటాలు కొనుగోలు చేశారు. ఈ నెల పదో తేదీ వరకూ ఎఫ్‌పీఐలు రూ.22,194 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.2024లో దాదాపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఉపసంహరించారు. గతేడాది మొత్తం నికర పెట్టుబడులు కేవలం రూ.427 కోట్లు మాత్రమేనని తెలుస్తోంది. డాలర్ ఇండెక్స్ ఇప్పుడు నిరంతరం 109 లకు పెరిగింది. మరోవైపు పదేండ్ల యూఎస్ బాండ్ల విలువ వృద్ధి చెందడం విదేశీ ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నెల రెండో తేదీ మినహా 12 వరకూ ఎఫ్‌పీఐలు ప్రతిరోజూ దేశీయ స్టాక్ మార్కెట్లలో వాటాలు విక్రయిస్తూనే ఉన్నారు. 2023లో గరిష్ట స్థాయిలో రూ.1.71లక్షల కోట్ల విలువైన ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చి చేరాయి. ఆర్థిక మూలాలు బలంగా ఉండటంతోపాటు ఆశావాహ దృక్పథంతో ఎఫ్‌పీఐ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు.