FPI Investments | దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నెలలో రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు తొలి నాలుగు సెషన్లలోనే రూ.10,850 కోట్ల విలువ గల షేర్ల కొనుగోలు చేశారు. సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండటం, జీఎస్టీ వసూళ్లలో గ్రోత్, అంచనాల కంటే మెరుగ్గా కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు రావడంతో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఆకర్షితులు అవుతున్నారు.
గత నెలలో ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు నికరంగా రూ.11,630 కోట్లు, మార్చిలో రూ.7,936 కోట్ల పెట్టుబడులు పెట్టారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో కుదేలైన అదానీ గ్రూప్ సంస్థల్లోకి అమెరికా కేంద్రంగా పని చేస్తున్న జీక్యూజీ పార్టనర్స్ నుంచి మార్చిలో భారీగా పెట్టుబడులు వచ్చి చేరాయని ఇన్వెస్టర్లు తెలిపారు.
అమెరికా డాలర్‌పై రూపాయి విలువ బలోపేతం, నాలుగో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు రావడంతోనే దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటర్జిస్ట్ వీకే విజయ్ కుమార్ చెప్పారు. డెట్ మార్కెట్ నుంచి గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2460 కోట్ల నిధులు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాదిలో ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు రూ.3430 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.1,808 కోట్ల పెట్టుబడులు పెట్టారు.