FPI Outflows | దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నిధుల ఉపసంహరణ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ బలహీన పడటం, యూఎస్ బాండ్ల విలువ బలోపేతం కావడం, కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి వాటాలను ఉపసంహరిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ రూ.64,156 (7.44 బిలియన్ డాలర్లు) కోట్ల విలువైన వాటాలను ఉపసంహరించారు. డిసెంబర్లో రూ.15,446 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టారు.
జాతీయ, అంతర్జాతీయ అనిశ్చితుల నేపధ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాత్సవ స్పందిస్తూ ‘అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ నిరంతరం పతనం కావడంతో విదేశీ ఇన్వెస్టర్లపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడింది. దీంతో భారత్ ఈక్విటీ మార్కెట్ల నుంచి వారు పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు’ అని చెప్పారు.
ఇటీవలి కాలంలో స్టాక్‌మార్కెట్లలో సర్దుబాట్లు, బలహీన కార్పొరేట్ ఫలితాలు, సూక్ష్మ, ఆర్థిక ఆర్థిక ప్రతికూల పరిస్థితులతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ఆచీతూచీ స్పందిస్తున్నారు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అనుసరించనున్న ఆర్థిక, వాణిజ్య విధానాలేమిటన్న విషయమై ఇన్వెస్టర్లు ఆచితూచీ ముందుకెళుతున్నారు. అందుకే రిస్క్‌తో కూడుకున్న మార్గాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ వేస్తున్నారు.
రెండో తేదీ మినహా ఈ నెల అంతా ఎఫ్‌పీఐలు వాటాలు విక్రయిస్తూనే ఉన్నారు. ఈ నెల 24 వరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.64,156 కోట్ల విలువైన వాటాలను ఉపసంహరించారు. డాలర్ ఇండెక్స్ 108 పై చిలుకు నమోదు కావడం, యూఎస్ బాండ్లు 4.5 శాతం వృద్ధి చెందడంతో విదేశీ ఇన్వెస్టర్ల వాటాల విక్రయం ఊపందుకుందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటర్జిస్ట్ వికే విజయ్ కుమార్ తెలిపారు.
యూఎస్ బాండ్లు ఆకర్షణీయంగా మారడంతో దేశీయ డెట్ మార్కెట్ నుంచి కూడా విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు ఉపసంహరించారు. డెట్ మార్కెట్ నుంచి రూ.4,399కోట్లు సాధారణ పరిమితి, స్వచ్ఛందంగా రూ.5,124 కోట్ల నిధులను ఉపసంహరించారు. 2024లో కేవలం రూ.427 కోట్ల పెట్టుబడులు మాత్రమే ఎఫ్‌పీఐలు పెట్టారు. 2023లో అసాధారణ రీతిలో రూ.1.71 లక్షల కోట్లు, అంతకుముందు 2022లో రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు.