న్యూఢిల్లీ, మే 31: దేశీయ రోడ్లపై మరిన్ని నూతన కార్లు దూసుకుపోవడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి పలు మాడళ్లను విడుదల చేసిన దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు మరిన్ని మాడళ్లను విడుదల చేయడానికి రెడీ అవుతున్నాయి. జూన్ నెలలో నాలుగు నూతన కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో ఈవీతోపాటు ఎస్యూవీ, లగ్జరీ కార్లు ఉన్నాయి. దేశీయంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని టాటా మోటర్స్ సరికొత్త మాడల్‌ను పరిచయం చేస్తున్నది.
ఈ వివరాలు…
టాటా హారియర్ ఈవీ
ఈ ఏడాది జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించిన హారియర్ ఈవీ మాడల్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది టాటా మోటర్స్. జూన్ 3న విడుదలకానున్న ఈ మాడల్ ధర రూ.25 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా. సింగిల్ చార్జింగ్‌తో 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఈ మాడల్‌లో 10.25 ఇంచుల డిస్ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్‌తో 10 స్పీకర్లు, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, ముందు-వెనుక రియర్ పార్కింగ్ సెన్సార్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌తో తయారుచేసింది.
ఎంజీ సైబర్స్టార్
మరో ఈవీని విడుదల చేయడానికి సిద్ధమైంది ఎంజీ. సైబర్స్టార్ పేరుతో విడుదల చేయనున్న ఈ మాడల్ ధర రూ.50 లక్షల స్థాయిలో ఉండనున్నట్టు అంచనా. రెండు డోర్లు, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్, డిస్ప్లేతో ఏసీ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, లెవల్-2 ఏడీఏఎస్ ఫీచర్, 77 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ 443 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
ఎంజీ ఎం9
ఎంజీ మరో మల్టీపర్పస్ వాహనమైన ఎం9ను పరిచయం చేయబోతున్నది. ఈ కారు ధర రూ.70 లక్షలుగా అంచనా. ఆరుగురు లేదా ఏడుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ మాడల్‌లో 90 కిలోవాట్ల బ్యాటరీతో సింగిల్ చార్జింగ్‌తో 400 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
ప్రత్యేక ఎడిషన్‌గా బెంజ్ కారు
మెర్సిడెజ్ బెంజ్ నూతన ఏఎంజీ జీ 63 మాడల్‌ను ఆధునీకరించి మళ్లీ విడుదల చేస్తున్నది. వచ్చే నెల 12న విడుదలకానున్న ఈ మాడల్ ధర రూ.3.50 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. 4 లీటర్ల ట్విన్-టర్బో వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారులో డ్రైవర్ వైపు 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్, మధ్యలో 11.9 ఇంచుల మరో టచ్‌స్క్రీన్, కేవలం 10.9 సెకండ్లలో 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 318 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.