తెలియదు.. చెప్తే వినరన్నట్టుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీరు.
అవును.. ఖజానాను నింపు కోవడమే తప్ప, దేశ ఆర్థిక వ్యవస్థను బాగు పర్చాలన్న సోయే లేకుండాపోతున్నది నరేంద్ర మోదీ సర్కారుకు.
కేవలం తయారీ రంగంపైనే దృష్టి పెడుతూ.. వ్యవసాయ, సేవా రంగాలను నిర్వీర్యం చేస్తున్నది. ఫలితంగా దేశ ఉద్యోగ-ఉపాధి పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయి.
అహ్మదాబాద్, అక్టోబర్ 27: ఆర్థిక మాంద్యం కోరలు చాస్తోంది. కీలక రంగాలు సంక్షోభంలోకి జారుకుంటున్నాయి. అయినా దేశ జీడీపీని నిలబెట్టాల్సిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. అసమర్థ విధానాలను మాత్రం వీడటం లేదు. ఇదీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళనిప్పుడు. తయారీ రంగం కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలకు కేంద్రం పెద్దపీట వేస్తున్నదన్న రాజన్.. ఇందుకోసం వెచ్చిస్తున్న సొమ్మును మరెక్కడైనా పెడితే గొప్ప లాభాలు అందుకోవచ్చని చెప్పడం గమనార్హం. ‘భారతీయ ఉద్యోగ-ఉపాధి పరిస్థితులు నిజంగా ఆందోళనకరం. సేవా తదితర రంగాల్లోని కార్మిక ప్రోత్సాహక ఉద్యోగాల ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం తప్పక దృష్టి పెట్టాలి’ అని అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విద్యార్థులతో తాజాగా మాట్లాడుతూ రాజన్ అన్నారు.
వ్యవసాయానిదే హవా
దేశంలో వ్యవసాయ రంగంపై మళ్లీ యువతకు ఆసక్తి పెరుగుతున్నదని రాజన్ తెలిపారు. గతంలో సేవా, తయారీ రంగాల్లోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వెతుక్కున్నారని, అయితే గడిచిన రెండేండ్లుగా తిరిగి అంతా వ్యవసాయ రంగానికి వచ్చేస్తున్నారని ఈ చికాగో విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడు చెప్పారు. కాగా, పెరుగుతున్న జనాభా దృష్ట్యా వ్యవసాయ రంగంలో మరిన్ని మెరుగైన అవకాశాలు రాబోయే రోజుల్లో ఉంటాయని ఆర్థిక నిపుణులూ సూచిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వ్యవసాయం దండగంటూ కార్పొరేట్లకు కేంద్రంలోని బీజేపీ సర్కారు పట్టం కడుతున్నది. ఈ క్రమంలో రైతు వ్యతిరేక చట్టాలను తేవాలని కుట్రలు చేస్తున్న సంగతీ విదితమే.
సేవా రంగంతోనే సాధ్యం
వృద్ధిరేటు బలోపేతానికి, ఉద్యోగ-ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం తయారీ రంగంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నదని, ఇది చాలా తప్పు అని రాజన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ‘తయారీ రంగ ఉద్యోగాలపై దృష్టి పెట్టవద్దని నేను చెప్పడం లేదు. నేను చెప్తున్నదేమిటంటే తయారీ రంగానికే పెద్ద ఎత్తున రాయితీలు అందుతున్నాయి. కానీ బలమైన సేవా రంగంపై దృష్టి పెడితే మరిన్ని ఉద్యోగాలను సృష్టించవచ్చు. ఎగుమతులూ పెరుగుతాయి’ అన్నారు. పైగా ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల్లో సేవా రంగ ఎగుమతులను పెంచుకోవడం చాలా సులభమనీ వ్యాఖ్యానించారు. మొత్తానికి తయారీ రంగంపై కేంద్రం చూపిస్తున్న అత్యుత్సాహం.. ఒకే గంపలో గుడ్లన్నింటినీ పెట్టి రిస్క్ చేస్తున్నట్టుందని అభివర్ణించారు.
భారత్‌లో చిప్‌ల తయారీ కంటే.. ఆ చిప్‌ల డిజైనింగ్ లాభదాయకం. చిప్‌ల తయారీకి భారీ ఎత్తున మూలధన ప్రోత్సాహకాలు అవసరం. పైగా దీనికున్న కార్మిక శక్తీ తక్కువే. కానీ చిప్‌ల డిజైనింగ్ చాలా అధిక విలువ కలిగిన వ్యాపారం. అంతేగాక దేశంలో ఎందరో ప్రతిభావంతులైన ఇంజినీర్లు, ఎన్నో మేనేజ్మెంట్లున్నాయి. వీరందరికీ గొప్ప అవకాశాలు వస్తాయి.
– రఘురామ్ రాజన్, ఆర్బీఐ మాజీ గవర్నర్