ముంబై, ఏప్రిల్ 11: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ ఆటో మాజీ వైస్ చైర్మన్ మాధుర్ బజాజ్ మృతిచెందారు. 73 ఏండ్ల వయస్సు కలిగిన బజాజ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అస్వస్థతతో ఇటీవల దక్షిణ ముంబైలో ఉన్న బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరిన ఆయన శుక్రవారం ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో గతేడాది జనవరిలో వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
ఎఫ్డీలపై వడ్డీ డౌన్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తమ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లను తగ్గించింది. ఆర్బీఐ ఇటీవలి ద్రవ్యసమీక్షలో రెపోరేటును పావుశాతం కోతపెట్టిన నేపథ్యంలో పీఎన్బీ రూ.3 కోట్లకు దిగువన ఉండే ఆయా కాలపరిమితి ఎఫ్‌డీల వడ్డీరేట్లను కట్ చేసింది. 7 రోజుల నుంచి పదేండ్లదాకా జనరల్ సిటిజన్స్‌కు అందుబాటులో ఉండే ఎఫ్‌డీల వడ్డీరేట్లు 3.50 శాతం నుంచి 7.10 శాతానికి పరిమితమయ్యాయి. ప్రస్తుతం 390 రోజుల టెన్యూర్‌పై గరిష్ఠంగా 7.10 శాతం వడ్డీ వస్తున్నది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీరేట్లను తగ్గించినది తెలిసిందే.