ముంబై, మార్చి 23: విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరువయ్యాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు ఈ నెల 15తో ముగిసిన వారాంతానికి 6.396 బిలియన్ డాలర్లు పెరిగి 642.492 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ విషయాన్ని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 10.47 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2021లో ఫారెక్స్ రిజర్వులు చారిత్రక గరిష్ఠ స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే.
విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ పెరగడం వల్లనే రిజర్వులు అంతకంతకు పెరుగుతున్నాయి. గత వారంలో 6.034 బిలియన్ డాలర్లు ఎగబాకి 568.386 బిలియన్ డాలర్లకు చేరాయని సెంట్రల్ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించింది. అలాగే గోల్డ్ రిజర్వులు 425 మిలియన్ డాలర్లు ఎగబాకి 51.14 బిలియన్ డాలర్లకు చేరుకోగా, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కింద రిజర్వులు 65 మిలియన్ డాలర్లు అధికమై 18.276 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వలు 129 మిలియన్ డాలర్లు తరిగిపోయి 4.689 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.