న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లలో లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌ల హవానే నడిచింది. స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు నిరాశపర్చాయి. ముఖ్యంగా చిన్న షేర్లు కుదేలయ్యాయి. జనవరి 1 నుంచి డిసెంబర్ 24 వరకు చూసినైట్టెతే స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 6.68 శాతం నష్టపోయింది. మిడ్‌క్యాప్ కూడా కేవలం 0.77 శాతం పెరుగుదలనే చూసింది. ఇదే సమయంలో బ్లూచిప్ షేర్ల సూచీ సెన్సెక్స్ 9.30 శాతం పుంజుకోవడం గమనార్హం. 2023, 2024లో వరుసగా రెండేండ్లు స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు అదరగొట్టాయి. గత ఏడాది స్మాల్‌క్యాప్ 29 శాతానికిపైగా ఎగిసింది. మిడ్‌క్యాప్ సైతం 26 శాతం ఎగబాకింది. సెన్సెక్స్‌ను మించి మదుపరులకు లాభాలను పంచిపెట్టాయి.
ఈ నేపథ్యంలో ఈ ఇండెక్స్‌లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులు ఈ ఏడాది లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని నిపుణులు 2025 మార్కెట్ సరళిని విశ్లేషిస్తున్నారు. దీన్ని వారు మార్కెట్ నార్మలైజేషన్గా అభివర్ణిస్తున్నారు. మరికొందరు ఎక్స్పర్ట్స్.. స్మాల్, మిడ్‌క్యాప్‌ల నుంచి తమ పెట్టుబడులను ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్ షేర్లలోకి మార్చారని, అందుకే ఈ ఏడాది చిన్న, మధ్యశ్రేణి షేర్ల సూచీలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయని అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ అనిశ్చిత స్థితిలోనూ బడా సంస్థలు బలమైన బ్యాలెన్స్ షీట్లను, స్థిరమైన లాభాలను చూపడం కలిసొచ్చిందని చెప్తున్నారు. దేశ, విదేశీ ఒడిదుడుకులు స్మాల్, మిడ్‌క్యాప్ సంస్థలను ఎక్కువగా ప్రభావితం చేశాయని అంటున్నారు. భారతీయ ఇన్వెస్టర్లు చిన్న షేర్లను కొన్నప్పటికీ.. విదేశీ మదుపరులు పెద్ద షేర్లపైనే ఆసక్తి కనబర్చారని, ఇదికూడా దెబ్బతీసిందని మెజారిటీ మార్కెట్ అనలిస్టులు పేర్కొంటున్నారు.
ఈ ఏడాది నవంబర్ 18న బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకుతూ 47,549.40 పాయింట్లకు చేరింది. 2024 సెప్టెంబర్ 24న ఆల్‌టైమ్ హై 49,701.15 వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఇక బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఈ ఏడాది జనవరి 3న ఏడాది గరిష్ఠ స్థాయిని తాకుతూ 56,497.39 పాయింట్ల వద్దకు వెళ్లింది. అలాగే ఏప్రిల్ 7న 52 వారాల కనిష్ఠాన్ని తాకుతూ 41,013.68 పాయింట్లకు పడిపోయింది. 2024లో బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ 12,506.84 పాయింట్లు లేదా 29.30 శాతం పెరిగింది. అలాగే మిడ్‌క్యాప్ ఇండెక్స్ 9,605.44 పాయింట్లు లేదా 26.07 శాతం ఎగిసింది.
2023లో బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 13,746.97 పాయింట్లు లేదా 47.52 శాతం, మిడ్‌క్యాప్ 11,524.72 పాయింట్లు లేదా 45.52 శాతం పుంజుకున్నాయి. 2022లో స్మాల్‌క్యాప్ 530.97 పాయింట్లు లేదా 1.80 శాతం నష్టపోగా, మిడ్‌క్యాప్ 344.42 పాయింట్లు లేదా 1.37 శాతం పెరిగింది. కాగా, సెన్సెక్స్‌లో నమోదైన కంపెనీ మార్కెట్ విలువలో ఐదో వంతు ఉంటే మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో, పదో వంతు ఉంటే స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లో షేర్లు ట్రేడ్ అవుతాయన్న సంగతి విదితమే. సెన్సెక్స్ 2023లో 11,399.52 పాయింట్లు లేదా 18.73 శాతం, 2022లో 2,586.92 పాయింట్లు లేదా 4.44 శాతం లాభపడింది.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత నెలకొన్నది. ఇక ఫారెక్స్ మార్కెట్లో అంతకంతకూ దేశీయ కరెన్సీ రూపాయి మారకం విలువ బలహీనపడిపోతున్నది చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఈ రెండింటి ప్రభావం వల్లే మదుపరులు కొనుగోళ్లను పక్కనపెట్టి లాభాల స్వీకరణకు దిగుతున్నారు.
-రవి సింగ్, మాస్టర్ క్యాపిటల్ సీఆర్వో
గత ఏడాది సెప్టెంబర్ నుంచి స్మాల్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు అమ్మకాల ఒత్తిడినే ఎదుర్కొంటున్నాయి. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం అనిశ్చిత స్థితి, విదేశీ సంస్థాగత మదుపరులు అదేపనిగా పెట్టుబడులను వెనుకకు తీసుకుంటుండటం కూడా చిన్న, మధ్యశ్రేణి షేర్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురిచేసింది.
-ఎన్ అరుణగిరి, ట్రస్ట్‌లైన్ హోల్డింగ్స్ సీఈవో